కుమరాంలో డయేరియాతో మహిళ మృతి..!

Woman dies with diarrhea In Vizianagaram - Sakshi

గరివిడి(చీపురుపల్లి) : గరివిడి మండలం కుమరాం గ్రామంలో మంగళవారం వేకువజామున తీవ్రమైన వాంతులు, విరేచనాలతో బీంపల్లి కనకమ్మ (43) అనే మహిళ మృతి చెందారు. డయేరియా సోకిన కారణంగానే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పినట్లు ఆమె భర్త రాముడు పేర్కొన్నారు.

ప్రతీ ఇంటిలోనూ జ్వర పీడితులు..

వారం రోజులుగా గ్రామంలో జ్వరాలు తిష్ఠ వేశాయని, ప్రతీ ఇంటిలోనూ జ్వర పీడితులు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అందరూ చీపురుపల్లి సీహెచ్‌సీకి, ప్రైవేటు ఆస్పత్రులకు తిరుగుతున్నారని, పట్టించుకోవాల్సిన వైద్యాధికారుల జాడ కానరావడం లేదని స్థానికులు చెబుతున్నారు.

నాలుగేళ్లుగా కానరాని పారిశుద్ధ్య పనులు.. 

కుమరాంలో నాలుగేళ్లుగా ఒక్కసారి కూడా పారిశుద్ధ్య పనులను సంబంధిత అధికారులు చేయించ లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక సర్పంచ్‌ బి.రాములమ్మ వయసు పైబడడం, పైపెచ్చు అప్పట్లో దళిత రిజర్వేషన్‌ కావడంతో ఆమెను అధికార పార్టీ నాయకులు సర్పంచ్‌ను చేశారు. అక్కడి ఉప సర్పంచ్‌ జంపాన రవిరాజు పంచాయతీ వ్యవహారాలు అన్ని నడిపిస్తారని, నిధులు, కాంట్రాక్ట్‌ పనులు అన్ని ఆయన చూసుకుంటారని స్థానికులు చెబుతున్నారు. డబ్బులు వచ్చే పనులు అయితే చేయిస్తారు తప్ప ప్రజలకు అవసరమైన పారిశుద్ధ్య పనులు వంటివి అసలు పట్టించుకోరని, అసలు నాలుగేళ్లుగా పారిశుద్ధ్య పనులు చేయలేదంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఇదేమని అడిగితే సర్పంచ్‌ను అడగమంటున్నారు..

పారిశుద్ధ్య పనులు ఎందుకు చేపట్టడం లేదని స్థానికులు ఉప సర్పంచ్‌ను అడిగితే తాను సర్పంచ్‌ను కాదని, మీరు వెళ్లి సర్పంచ్‌నే అడగాలని ఆమె మీద నెపం నెట్టివేస్తారని చెబుతున్నారు. సర్పంచ్‌కు కనీసం చదువు రాదు. పంచాయతీ పనుల్లో అనుభవం లేదు. ఇలాంటి నాయకులను ఎన్నుకుని తాము అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వారం రోజులుగా ప్రజలు జ్వరాలతో అవస్థలు పడుతుంటే కనీసం ఏఎన్‌ఎం కూడా గ్రామానికి రాలేదని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపాన పోలేదని చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలుగజేసుకుని తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, వైద్య శిబిరాలు నిర్వహించాలని, లేకుంటే మరిన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయే అవకాశం ఉందని స్థానికులు కోరుతున్నారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top