ముగ్గురిని బలిగొన్న వివాహేతర సంబంధం

Woman Arrest In Three Murders Case Tamil Nadu - Sakshi

మహిళ , మరో ఇద్దరి అరెస్ట్‌

టీ.నగర్‌: సేలం సమీపంలో వివాహేతర సంబంధం వ్యవహారంలో ఇద్దరు మాజీ ప్రియుళ్లను, భర్తను హత్య చేయించిన మహిళ, ఇద్దరు కిరాయి రౌడీలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. సేలం జల్లా, ఆత్తూరు సమీపం తలైవాసల్‌ పుత్తూరు వడక్కాడు ప్రాంతానికి చెందిన కలియమూర్తి (40) భార్య ఆలయమణి (30).  వీరి కుమారులు రాంకుమార్‌ (16), అరుణ్‌కుమార్‌ (14). కలియమూర్తి డీఎండీకే నేతగా ఉన్నారు. ఈనెల 17వ తేదీ రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న కలియమూర్తిని గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడిచేసి హతమార్చారు. దీనిపై తలైవాసల్‌ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి విచారణ జరిపారు. ప్రాథమిక విచారణలో ఈ హత్యలో కలియమూర్తి భార్య ఆలయమణికి సంబంధం ఉన్నట్లు తెలిసింది.

ఆమె వద్ద విచారించగా.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నందున ప్రియుడు కుమార్‌తో కలిసి హత్య చేసినట్లు తెలిసింది. ఈ హత్యకు సంబంధించి కల్లకురిచ్చికి చెందిన ఇద్దరు కిరాయి రౌడీలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద పోలీసులు విచారణ జరపగా విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఆలయమణితో ఇదివరకే వివాహేతర సంబంధం ఉన్న తలైవాసల్‌కు చెందిన వ్యక్తిని ప్రస్తుత ప్రియుడు కుమార్, పోలీసులకు పట్టుబడిన ఇద్దరు కిరాయి ముఠా సభ్యులతో కలిసి ఉరేసి చంపారని చెప్పారు. పోలీసులు ఈ కేసును ఆత్మహత్యగా నమోదు చేశారన్నారు. అదేవిధంగా ఆలయమణితో అక్రమ సంబంధం ఉన్న మరో యువకుడిని రోడ్డుపై నడిచి వెళుతుండగా వాహనంతో ఢీకొని చంపగా దాన్ని ప్రమాదంగా చిత్రీకరించారన్నారు. రెండు కేసులపై పోలీసులు తిరిగి విచారణ చేపట్టారు. ముఖ్య నిందితుడైన ప్రియుడు కుమార్‌ను అరెస్ట్‌ చేస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. పోలీసులు కుమార్, కిరాయి ముఠాకు చెందిన మరి కొందరి కోసం గాలిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top