భార్య ప్రియుడి చేతిలో భర్త హతం

Wife Boyfriend KIlled Husband In East Godagvari - Sakshi

చంద్రమాంపల్లి హైస్కూల్‌ ఆవరణలో కప్పెట్టేశాడు

మృతదేహాన్ని వెలికితీయించిన పోలీసులు

తూర్పుగోదావరి ,పెద్దాపురం/కిర్లంపూడి (జగ్గంపేట): భార్యతో సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. ఆమె భర్తను చంపేసి నిలువునా పాతేశాడు. భార్య, ప్రియుడి అక్రమ సంబంధాన్ని గుర్తించలేని అతడు.. స్నేహంగా మద్యం సేవించి ప్రియుడు చేతిలో హతమయ్యాడు. పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి గ్రామంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తొలుత అదృశ్యం కేసుగా.. ఆ తరువాత హత్య కేసు నమోదైన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

జూన్‌ 26న అదృశ్యంపై కేసు నమోదు
కిర్లంపూడి మండలం ముక్కోలు గ్రామానికి చెందిన మచ్చా సత్తిబాబు (28) గత జూన్‌ 19న అదృశ్యమయ్యాడు. 22వ తేదీ వరకు గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో కిర్లంపూడి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా 26న అదృశ్యం కేసుగా నమోదు చేశారు. తాటిపర్తికి చెందిన జ్యోతితో గత ఏడాదిన్నర క్రితం ఇతడితో వివాహమైంది. చంద్రమాంపల్లికి చెందిన యువకుడు చెక్కిడాల రాజాతో ఆమెకు పరిచయం ఉండడంతో ఆమె భర్తతో పరిచయం పెంచుకున్నాడు. అతడి అడ్డు తొలగించే పన్నాగంతో అతడిని చంద్రమాంపల్లికి రమ్మని పిలిచాడు. మరో ఇద్దరితో కలిసి నిందితుడు.. నూతనంగా నిర్మించిన స్కూల్‌ కాంప్లెక్స్‌ గదిలో అతడిని కలిసి మద్యం సేవించి.. హత్య చేశారు. అదే పాఠశాల ఆవరణలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.

హత్యకు వినియోగించిన రాడ్‌ను దివిలి గ్రామ శివారులోని చెత్తకుప్పలో దాచి, బైక్‌ను జి.రాగంపేటలో యువకుడి ఇంట్లో ఉంచారు. ఈ పరిస్థితితో సోమవారం ఉదయం చంద్రమాంపల్లి పాఠశాలకు సెలవు ప్రకటించారు. స్థానిక తహసీల్దార్‌ జి.సుబ్రహ్మణ్యం, వైద్యులు విజయ్‌మోహన్, జగ్గంపేట సీఐ విశ్వనాథ్‌ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. హత్యకు ఉపయోగించిన వాటిని కేసు దర్యాప్తు చేస్తున్న కిర్లంపూడి ఎస్సై బాలాజీ స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితులు జగ్గంపేట సీఐ కస్టడీలో ఉన్నారని, విచారణ పూర్తి అయ్యాక వివరాలన్నీ వెల్లడిస్తామని సీఐ తెలిపారు.

ముక్కొల్లులో విషాద ఛాయలు
ఈ ఘటనతో కిర్లంపూడి మండలం ముక్కొల్లు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలోని కాలనీలో నివాసం ఉంటూ అందరితో కలిసిమెలసి సరదాగా ఉండే సత్తిబాబు మృతదేహం గ్రామానికి చేరడంతో కాలనీవాసులు దుఖసాగరంలో మునిగిపోయారు. మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరును గ్రామస్తులను కలిసివేసింది. గ్రామానికి చెందిన నాయకులు బస్వా వీరబాబు, ఎంటీటీసీ విశ్వనాథం చక్రరావు, పలువురు గ్రామ పెద్దలు.. మృతుడి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతిని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top