రక్తమోడిన రోడ్లు

Three Road Accident In 24 Hours In Medak District Telangana - Sakshi

మెదక్‌ జిల్లాలో ఒకేరోజు మూడు ప్రమాదాలు

పది మంది దుర్మరణం.. మరో 13 మందికి గాయాలు

మెదక్‌జోన్‌/కొల్చారం/చేగుంట: మెతుకుసీమలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. సోమవారం ఒకేరోజు జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 13 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఓ చిన్నారితోపాటు ఐదుగురు మహిళలు ఉన్నారు.

మొక్కు తీర్చుకునేందుకు వెళుతూ..
సంగారెడ్డి జిల్లా పసల్‌వాది మండలం గంజిగూడెం గ్రామానికి చెందిన గొడుగు రాములు ఏడుపాయల్లో అమ్మవారి మొక్కు తీర్చుకునేందుకు బంధువులను ఆహ్వానించారు. దీంతో ఆదివారం రాత్రి కొంతమంది ఏడుపాయలకు చేరుకోగా.. సోమవారం ఉదయం సుమారు 25 మంది మహిళలు, చిన్నారులు, వృద్ధులు డీసీఎంలో బయల్దేరారు. మెదక్‌ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా మెదక్‌ నుంచి పటాన్‌చెరుకు వెళ్తున్న సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు(టీఎస్‌35 టీ 7452) అతివేగంగా డీసీఎంను ఢీకొట్టింది. 

ఆ ధాటికి ఐదుగురు మహిళలు గుర్తుపట్టని విధంగా గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 11 మంది గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో తొమ్మిదేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. మృతుల్లో సంగారెడ్డి జిల్లా అంగడిపేట గ్రామానికి చెందిన చాపల మాధవి(40), కంది మండలం చెర్యాల గ్రామానికి చెందిన మన్నె మంజుల(40), గంజిగూడెంకు చెందిన నీరుడి దుర్గమ్మ(58), గూడల మాణెమ్మ(55), పసల్‌వాదికి చెందిన గొడుగు రజిత(45), సదాశివపేట మండలం వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన దిగ్వాల్‌ మధురిమ (9) ఉన్నారు. బస్సు డ్రైవర్‌ సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

కంటతడి పెట్టిన కలెక్టర్‌
సంగాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాద విషయం తెలుసుకున్న మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి మెదక్‌ ఏరియా ఆస్పత్రికి చేరుకొని క్షతగాత్రులను, మృతుల కుటుంబీకులను పరామర్శించారు. ఈ సందర్భంగా చిన్నారి మధురిమ తల్లి మంజుల కలెక్టర్‌ కాళ్లపై పడి రోదించారు. ‘నాకు ఒక్కతే బిడ్డ! ఆమె నాకు లేకుండా పోయింది.. ఇక నేను ఎవరి కోసం బతకాలి’అంటూ విలపించడంతో కలెక్టర్‌ కూడా కంటతడిపెట్టారు. 

వీడ్కోలు పలికి వస్తూ మృత్యుఒడికి...
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి గ్రామానికి చెందిన పిట్ల రవి దుబాయ్‌కి వెళ్తుండటంతో తోడల్లుడు కృష్ణ, వదిన కావ్య, తాత కిష్టయ్య, బావమరిది అజయ్‌ మారుతీ ఓమ్నీ వ్యానులో శంషాబాద్‌కు వెళ్లి వీడ్కోలు పలికారు. తిరుగు ప్రయాణంలో మెదక్‌ జిల్లా నార్సింగి శివారు వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మాచారెడ్డికి చెందిన కిష్టయ్య(60), డ్రైవర్‌ ఆంజనేయులు (25), రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేటకుకు చెందిన కృష్ణ(28) అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణ భార్య కావ్య, ఆమె తమ్ముడు అజయ్‌కు గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం రామాయంపేటలోని ఆస్పత్రికి తరలించారు. 

అత్తగారింటికి వెళ్తూ అనంతలోకాలకు...
సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌ మండలం సిర్గాపూర్‌ గ్రామానికి చెందిన నర్సయ్య(27) హైదరాబాద్‌లోని సుచిత్ర వద్ద నివసిస్తున్నారు. ఆదివారం అర్థరాత్రి బాన్సువాడలో ఉంటున్న తన అత్తగారింటికి బైక్‌పై వెళ్తుండగా మనోహరాబాద్‌ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top