
సాక్షి, తిరువళ్లూరు(చెన్నై): ఫ్యాక్షనిస్టు సినిమాల తరహలో నడిచే రైలులో కత్తులను తిప్పుతూ అలజడి రేపిన నలుగురు కాలేజ్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై నుంచి తిరుత్తణి వెళ్తున్న యూనిట్ రైలులో డోర్ల వద్ద వేలాడుతూ.. కొందరు యువకులు కత్తులు చూపిస్తూ నానా హంగామా సృష్టించారు. రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. పలు టీవీ చానళ్లు ఈ ఘటనపై కథనాలు ప్రసారం చేశాయి.
దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు ఆయుధాలతో హడావుడి చేసిన విద్యార్థులను గుర్తించేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో పట్టాభిరామ్ రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న చెన్నై కళాశాల విద్యార్థి దండపాణిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు తెలిపిన వివరాల మేరకు తిరువళ్లూరు జిల్లా పాక్కం గ్రామానికి చెందిన విఘ్నేష్, జగదీషన్, బాలమురళీకృష్ణన్ తదితరులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయుధపూజ చేయాలన్న ఉద్దేశంతోనే కత్తులతో ప్రయాణించినట్టు విద్యార్థులు తెలిపారు. అయితే, ప్రత్యర్థి వర్గం వారిని భయపెట్టడానికే వారు కత్తులతో సంచరించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నలుగురిని అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి పుళల్ జైలుకు తరలించారు.