నిందితులంతా టీడీపీ నేతలే..విస్తుగొలిపే వాస్తవాలు

Shocking facts revealed in TDP Leader Uma Yadav murder case - Sakshi

ఉమాయాదవ్‌ హత్య కేసులో కర్త, కర్మ, క్రియ అందరూ ఆ పార్టీ వారే..

 12 మందిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

 నిందితుడు ఏనుగు కిషోర్, మృతుడి మధ్య తొలి నుంచి ఆధిపత్య పోరు

ఈ నెల 8వ తేదీన వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సిద్ధమైన ఉమాయాదవ్‌

 అతను రాజకీయంగా ఎదుగుతాడనే దురుద్దేశంతో హత్య

 ప్రణాళిక ప్రకారం వైఎస్సార్‌సీపీపై విమర్శలు

 విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి.. 

సాక్షి, గుంటూరు/తాడేపల్లిరూరల్‌ (మంగళగిరి): రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ ఎంతకైనా తెగిస్తుందనే విషయం మరోసారి రుజువైంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో గత నెల 25న టీడీపీ నేత, మాజీ రౌడీ షీటర్‌ ఉమాయాదవ్‌ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ హత్యోదంతంపై మాజీ మంత్రి నారా లోకేశ్‌ స్పందిస్తూ ‘బిహార్‌ తరహాలో ఏపీలో పాలన సాగుతోంది.. వైఎస్సార్‌సీపీ అరాచకాలు సృష్టిస్తోంది..’ అంటూ ప్రభుత్వం మీద బురదజల్లారు. సీన్‌ కట్‌ చేస్తే రెండు వారాల్లో పోలీసులు హత్య కేసును ఛేదించారు. ఈ సందర్భంగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. బుధవారం 12 మంది నిందితులను కోర్టులో హాజరు పరచగా.. ఇందులో 11 మంది టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలే కావడం గమనార్హం. రాజకీయ లబ్ధి కోసం హత్య చేసి ఒక ప్రణాళిక ప్రకారం నెపాన్ని వైఎస్సార్‌సీపీపై నెట్టేందుకు టీడీపీ చేసిన ప్రయత్నం బట్టబయలైంది.

చదవండి: మంగళగిరిలో రౌడీషీటర్‌ హత్య

ఆధిపత్య పోరులో భాగంగా..
మంగళగిరి ద్వారకా నగర్‌కు చెందిన ఉమాయాదవ్, కోనేరు ప్రాంతంలో నివసిస్తున్న టీడీపీ నాయకుడు, మాజీ రౌడీ షీటర్‌ ఏనుగు కిశోర్‌ మధ్య గత కొద్ది కాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో ఈనెల 8న వైఎస్సార్‌సీపీలోకి చేరాలని ఉమాయాదవ్‌ నిశ్చయించుకున్నాడు. అయితే అతను అధికార పార్టీలో చేరితే రాజకీయంగా ఎదుగుతాడనే దురుద్దేశంతో ఉమాయాదవ్‌ను అంతమొందించాలని కిశోర్‌ స్కెచ్‌ వేశాడు. మాజీ రౌడీ షీటర్‌ తోట శ్రీనివాసులుతో ఒప్పందం చేసుకున్నాడు. గత నెల 25న టీడీపీకి చెందిన మాజీ రౌడీ షీటర్‌ తోట పానకాలు, రుద్రు గోపి, తోట సాంబశివరావు, చింతా శివప్రసాద్, నల్లగొర్ల శ్రీనివాసరావు, చావలి మురళీకృష్ణ, తోట సైదులు, షేక్‌ వజీర్‌లు, మరో ఇద్దరి సాయంతో ఉమాయాదవ్‌ను దారుణంగా చంపేశారు. అనంతరం ప్రభుత్వంపై బురద జల్లడం కోసం టీడీపీ పెద్దలు ఈ హత్యను వాడుకున్నారు. ఓ నిండు ప్రాణం బలైందన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఆ పార్టీ పెద్దలు విమర్శలు చేశారు. పోలీసుల విచారణలో నిజాలు వెలుగు చూసి హత్య చేసిన వారందరూ టీడీపీ వారేనని తేలడంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

డీఎస్పీతో సంబంధాలు
స్థానికంగా మంచి పట్టున్న ఉమాయాదవ్‌ను గతంలో టీడీపీలోకి తీసుకురావడంలో మంగళగిరి డీఎస్పీగా పనిచేసిన అధికారి కీలక పాత్ర పోషించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా అతను వైఎస్సార్‌సీపీలో చేరాలని ప్రయత్నించిన సమయంలో సైతం గుంటూరు అర్బన్‌ జిల్లాలో ఓ కీలక పోస్టులో ఉన్న ఆ డీఎస్పీ అడ్డుకున్నారు. కాలక్రమంలో ఉమాయాదవ్‌కు, డీఎస్పీకి మధ్య చిన్నపాటి గొడవలు వచ్చాయి. దీంతో అతని వ్యతిరేకవర్గమైన చావలి మురళి, ఏనుగ కిషోర్‌లను డీఎస్పీ చేరదీశాడు. ప్రస్తుతం యర్రబాలెంలో చెరువు సమీపంలో ఉన్న ఓ స్థలానికి సాక్షాత్తు మంగళగిరి రూరల్‌ ఎస్‌ఐని కాపలా పెట్టి, డీఎస్పీ కబ్జా చేయించాడు. ఆ స్థలం కూడా చావలి మురళి పేరుమీద ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అక్కడ నుంచి ఏనుగు కిశోర్, ఉమాయాదవ్‌ మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. హత్య కేసులో కీలక సూత్రధారి అయిన కిశోర్‌ గత ఐదేళ్ల కాలంలో టీడీపీ పెద్దల అండదండలతో పోలీసుల పోస్టింగ్‌లు, ఇతరత్రా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. ఒకానొక సందర్భంలో మంగళగిరి సీటును ఆశిస్తూ కిశోర్‌ చంద్రబాబు వద్దకు సైతం వెళ్లారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top