తవ్వినకొద్దీ డబ్బే!

sand Smuggling in salakanchervu - Sakshi

సలకంచెర్వులో ఇసుకాసురులు

అనుమతికి మించి తవ్వకాలు

చెరువులు, పొలాల్లోనూ ఇదే దందా

టిప్పర్లు, ట్రాక్టర్ల వినియోగం

గ్రామస్తులు అడ్డుచెప్పినా ఆగని తంతు

మౌనం దాల్చిన అధికారులు

శింగనమల: ఇసుక అక్రమ రవాణా అధికార పార్టీ నేతలకు కాసులు కురిపిస్తోంది. మండలంలోని సలకంచెర్వు ఇసుక రీచ్‌ను ఓ టీడీపీ నాయకుడు దక్కించుకున్నాడు. అనుమతి పొందిన క్యూబిక్‌ మీటర్లకు మించి అక్రమంగా ఇసుక తరలిస్తున్నా ఇక్కడ ఎవ్వరూ అడగరు. గ్రామస్తులు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం చూస్తే అధికార పార్టీకి అధికారులు ఏస్థాయిలో వంత పాడుతున్నారో అర్థమవుతోంది. మండలంలోని సలకంచెర్వు వద్ద టీడీపీ నాయకుడికి 168–1, 168–2 సర్వే నంబర్లలో 0.74 సెంట్లలో ఇసుక రీచ్‌కు అనుమతి ఇచ్చింది. అందులో ఒక మీటరు లోతులో 3,473 క్యూబిక్‌ మీటర్ల ఇసుక తవ్వుకోవచ్చని ఉత్తుర్వుల్లో పేర్కొన్నారు. అయితే రెవెన్యూ అధికారులు సర్వే చేసిన ప్రాంతంలో కాకుండా ఇష్టారీతిన రీచ్‌ను మార్పు చేస్తూ ఇసుకను అడ్డంగా తవ్వేస్తున్నారు. ఇసుక రీచ్‌ కిందనే కూతలేరు వంక ఉండడంతో, అక్కడ కూడా ఇతసుకను తవ్వేస్తున్నారు. కూలీలతో లోడింగ్‌ చేయించినందుకు మాత్రమే చార్జీలు వసూలు చేయాల. లోడింగ్‌కు యంత్రాలు ఉపయోగించరాదనేది నిబంధన కాగా.. యథేచ్ఛగా వీటితోనే తవ్వకాలు చేపడుతున్నారు.

ఆడ్డుకున్న ప్రజలు
ఇసుక అక్రమంగా తరలిస్తే భూగర్భ జలాలు తగ్గిపోతాయనే భయంతో సలకంచెర్వు గ్రామస్తులు పలుమార్లు టిప్పర్లను అడ్డగించినా ఫలితం లేకపోయింది. చివరకు విషయాన్ని పోలీసులకు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రామస్తులు కూడా మిన్నకుండిపోవాల్సి వచ్చింది.

రోజుకు 360 క్యూబిక్‌ మీటర్ల తరలింపు
రోజుకు 10 టిప్పర్ల ద్వారా తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరుకు ఇసుకను తరలిస్తున్నారు. ఒక టిప్పరుకు 9 క్యూబిక్‌ మీటర్లు చొప్పున ఒక్కో టిప్పురు నాలుగు సార్లకు తక్కువ కాకుండా తరలిస్తున్నారు. రోజూ 40 టిప్పర్ల చొప్పున 360 క్యూబిక్‌ మీటర్ల ఇసుక తరలిస్తున్నారు. ఈ తంతు 45 రోజులుగా సాగుతోంది. వీటితో పాటు నాలుగు ట్రాక్టర్లలోనూ ఇసుక తరలిపోతోంది. ఇప్పటి వరకు రీచ్‌లో 16వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుక తరలించినట్లు తెలుస్తోంది. కేవలం ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్‌ కాపీ జిరాక్స్‌ చేసి.. దానిమీద ఇసుక రీచ్‌ పేరుతో తయారు చేసిన సీల్‌ వేసి, పోలీసులు పట్టుకోకుండా టిప్పర్లుకు ఇస్తున్నారు. కానీ రోజుకు ఎన్ని టిప్పర్లు, ఎన్ని క్యూబిక్‌ మీటర్లు తీసుకెళ్లినది, ఇప్పటివరుకు ఎంత తరలించిన విషయాలకు సంబంధించిన రికార్డులు కూడా ఇక్కడ అందుబాటులో లేకపోవడం గమనార్హం.

టిప్పరుకు రూ.3,500 నుంచి     రూ.4వేల వరకు వసూలు
టిప్పరుకు రూ.3500 నుంచి రూ.4వేల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. ఇప్పటి వరకు 1,750 టిప్పర్ల ఇసుక తరలించినట్లు సమాచారం. ఈ లెక్కన రీచ్‌ నిర్వాహకులకు రూ.60 లక్షల వరకు సొమ్ము చేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఇసుక ఒక మీటరు లోతులో మాత్రమే తీయాల్సి ఉండగా.. మూడు నుంచి నాలుగు మీటర్ల లోతున తవ్వేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top