గంటకు రూ.2 లక్షలు హుష్‌కాకి

Rs 2 lakh lost to banking frauds every hour; Karnataka - Sakshi

రాష్ట్రంలో ఇదీ ఆన్‌లైన్‌ మోసాల జోరు

దేశంలోనే మూడవస్థానం

మీకు రూ.3 కోట్ల యూరో లాటరీ తగిలింది. ప్రాసెసింగ్‌ ఫీజుల కింద తక్షణమే రూ. 5 లక్షలు ఈ ఖాతాలో జమచేయండి
హలో.. మీ డెబిట్‌ కార్డు సర్వీస్‌ బ్లాక్‌ అయ్యింది, పిన్, ఓటీపీ చెబితే వెంటనే పునరుద్ధరిస్తాం..
హాయ్‌ డియర్, నేను అమెరికా నుంచి నీ కోసం రూ.50 లక్షల విలువైన వజ్రాలు, నగలను పంపించా. కస్టమ్స్‌ ఫీజుల కోసం రూ.12 లక్షలు పంపించవూ ప్లీజ్‌.. ఇలాంటి మాటలతో ఆన్‌లైన్‌ నేరగాళ్లు ప్రజలకు బురిడీ కొట్టిస్తున్నారు. రాష్ట్రంతో పాటు బెంగళూరులో ఒక్క ఏడాదిలోనే రూ. 9.16 కోట్లను దోచేశారు.

సాక్షి, బెంగళూరు: దేశాన్ని డిజిటల్‌ చెల్లింపుల వైపునకు నడిపించాలని కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఆలోచిస్తుంటే మరోవైపు దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ప్రతి గంటకు రూ. 2 లక్షలు బ్యాంకు ఖాతాల నుంచి పక్కదారి పడుతున్నట్లు తెలిసింది. ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్‌ కార్డుల చెల్లింపులను ఉపయోగించుకుని నేరగాళ్లు సైబర్‌ దోపిడీకి పాల్పడుతున్నారు. గతేడాది ఇంటర్‌నెట్‌ బ్యాకింగ్, డెబిట్, క్రెడిట్‌ కార్డుల ద్వారా దేశవ్యాప్తంగా రూ. 178 కోట్లను ఆన్‌లైన్‌ దొంగలు కొట్టేశారు. ఇప్పటివరకు సైబర్‌ నేరగాళ్లు దోచుకున్నది ఇదే అతిపెద్ద మొత్తం. ఇలా రోజుకు సగటున రూ. 48 లక్షలను నొక్కేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2017, డిసెంబర్‌ 21 వరకు జరిగిన సైబర్‌ దోపిడీపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ బ్యాంకులు నివేదికలు అందజేశాయి.

బెంగళూరులోనే అధికం
భారతీయ రిజర్వ్‌ బ్యాంకు నివేదికల ప్రకారం, 2016–17 ఆర్థిక సంవత్సరంలో జరిగిన సైబర్‌ నేరాల్లో కర్ణాటక మూడో స్థానంలో నిలిచింది. మొత్తం రూ. 9.16 కోట్ల విలువైన డబ్బు సైబర్‌దొంగల పాలైంది. దీనిపై 221 కేసులు నమోదయ్యాయి. కాగా, మహారాష్ట్ర రూ. 12.10 కోట్ల మోసంతో తొలి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఒక్క నెలలోనే 250 కేసులు బెంగళూరులోని సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌లో నమోదయ్యాయి. బ్యాంకింగ్‌ లావాదేవీలపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ప్రజలు మోసపోతున్నారని నిపుణులు భావిస్తున్నారు. బ్యాంకింగ్‌ మోసాలు జరిగినట్లు అనుమానం వచ్చినా లేదా గుర్తించిన వెంటనే సంబంధిత బ్యాంక్‌ సహాయక కేంద్రానికి ఫోన్‌ చేసి బ్యాంక్‌ ఖాతాను తక్షణమే బ్లాక్‌ చేయించాలని నిపుణులు చెబుతున్నారు. ఆ వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం వల్ల దర్యాప్తు వేగంగా జరిగే అవకాశముంది.

అవగాహన లేకపోవడమే కారణం..
గతంలో బ్యాంకింగ్‌ మోసాలు జరుగకుండా గట్టి చర్యలు తీసుకున్నామని ఆర్‌బీఐ ప్రకటించినప్పటికీ ఏటికేడాది వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. సైబర్‌ మోసగాళ్లు హ్యాకింగ్‌లో ఆధునిక టెక్నాలజీతో పాటు జనం అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుంటున్నారు. ప్రజల్లో బ్యాంకింగ్‌ లావాదేవీలు, విధివిధానాలపై అవగాహన కల్పించాలని గత నెల చివరి వారం అన్ని రాష్ట్ర డీజీపీలను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్, డెబిట్, క్రెడిట్‌ కార్డుల పిన్‌ నంబర్లు, ఓటీపీ నంబర్‌ తదితర వాటిని బహిర్గత పరచకుండా ప్రజల్లో అవగాహన  కల్పించాలని సూచించింది. ఈ విషయంలో ఆర్థిక సంస్థలు, ఎన్జీవోలు, విద్యా సంస్థలు సహకరించి ప్రజలకు డిజిటల్‌ చెల్లింపులపై అవగాహన కల్పించాలని కోరింది. ఆన్‌లైన్‌ మోసాలపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top