
సాక్షి, ఒంగోలు: నగరంలో దొంగలు రెచ్చిపోయారు. యజమానులు ఇంట్లో లేని సమయం అదునుగా చేసుకున్నారు. తాళం వేసి ఉన్న ఇంటికి కన్నం వేశారు. ఓనర్లు దేవుడికి మొక్కు చెల్లించే లోపే, ఇంట్లోని వస్తువులను క్షవరం చేశారు. పెద్దమొత్తంలో నగదు, ఆభరణాలు చోరీ చేసుకెళ్లారు.
వివరాల్లోకి వెళ్తే నగరంలోని ఏనుగుచెట్టు సమీపంలోని మహాలక్ష్మమ్మ కాలనీకి చెందిన అప్పల కోటేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 21, శనివారం రోజున తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. దేవుడి దర్శనం అనంతరం సోమవారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి తులుపులు పగులగొట్టి ఉన్నాయి. దీంతో కోటీశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంట్లో ఎవరూలేని సమయంలో వెనుక తలుపులు పగులగొట్టి, బీరువాలో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు, వజ్రాల ఆభరణాలను దోచుకెళ్లారు. చోరీకి గురైన వాటి విలువ రూ.3కోట్లకు పైగా ఉంటుందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్‌రావు తెలిపారు.