మృత్యువు మింగేసింది

Mother And Son Died By Electric Shock - Sakshi

శుక్రవారం ఉదయం.కొత్తగూడెం రుద్రంపూర్‌లోని క్లబ్‌ ఏరియా క్వార్టర్‌ నంబర్‌ డి–226. ఆరేళ్ల ఆ బుడ్డోడు అటూ ఇటూ పరుగెత్తుతున్నాడు. తనను పట్టుకునేందుకు వస్తున్న తల్లికి అందకుండా తప్పించుకుంటున్నాడు. ముందు బుడ్డోడు.. వెనుక తల్లి. ఇద్దరూ కాసేపు పరుగెత్తే ఆట ఆడుకున్నారు. చివరికి వాడిని గట్టిగా పట్టేసుకుంది. ఆ బుడ్డోడు కిలకిలా నవ్వుతున్నాడు.

వాడికి ముద్దులు కురిపిస్తూ బాత్రూంలోకి తీసుకెళ్లింది ఆ తల్లి. స్నానం ముగించింది. ఆ బుడ్డోడు ఇంకా నీటితో ఆడుతున్నాడు. రోజూ ఇది వాడికొక సరదా...! ఆ అల్లరిని చూస్తున్న అమ్మకు కూడా అదొక మురిపెం...!! ‘‘స్కూల్‌ టైమవుతుంటే ఆటలేంట్రా...’’ అంటూ, వాడికి గబగబా స్నానం చేయించింది.

వాడి లేలేత బుగ్గలపై ముద్దులు పెట్టింది. ఒళ్లు తుడిచేందుకని దండెం తీగపై ఉన్న టవల్‌ను ఒక్కసారిగా లాగింది. ఆ తీగ తెగింది. వారిద్దరిపై పడింది. అంతే...దండెం తీగకు విద్యుత్‌ ప్రసారం  దానికి తగలడంతో తల్లి, చిన్నారి మృతి

సింగరేణి(కొత్తగూడెం): విద్యుదాఘాతంతో తల్లి, ఆరేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు... రుద్రంపూర్‌ క్లబ్‌ ఏరియాలోని క్వార్టర్‌ నెంబర్‌ డి–226లో హుస్సేన్, ఆయన భార్య నజీమ(35), ఆరేళ్ల కుమారుడు అర్హన్‌ నివసిస్తున్నారు. హుస్సేన్, గురువారం రాత్రి డ్యూటీకి వెళ్లారు.

శుక్రవారం ఉదయం అర్హన్‌ను స్కూల్‌కు సిద్ధం చేసే ప్రయత్నంలో తల్లి నజీమ నిమగ్నమైంది. వాడికి స్నానం చేయించింది. బాత్రూం వద్దనున్న దండెం తీగపై ఉన్న టవల్‌ను ఒక్కసారిగా గట్టిగా లాగింది. దండెం తీగ తెగింది. వారిద్దరిపై పడింది. అప్పటికే ఆ దండెం తీగకు విద్యుత్‌ ప్రసరిస్తోంది. ఈ విషయం నజీమకు తెలియదు. ఆ తీగ తెగడం, కింద పడడం. వారిద్దరూ విద్యుదాఘాతంతో ప్రాణాలొదలడం... కొన్నంటే కొన్ని క్షణాల్లోనే దారుణం జరిగింది. 

నైట్‌ డ్యూటీకి వెళ్లి ఇంటికి తిరిగొచ్చిన హుస్సేన్‌కు... అక్కడి దృశ్యాన్ని చూడగానే.. ‘గుండె పగిలిపోతుందేమో..’ అన్నంతగా పెద్దపెట్టున ఏడ్చారు. ఆ దృశ్యం.. ఆ చుట్టుపక్కల వారికి కన్నీరు తెప్పించింది.  

ఎలా జరిగింది...? 

హుస్సేన్‌ ఇంటి పక్కనే 225 క్వార్టర్‌ ఉంది. ఆ ఇంటి పై కప్పు ఇనుప పైపులకు సీలింగ్‌ ఫ్యాన్‌ బిగించి ఉంది. బయటకు కనిపిస్తున్న ఆ ఇనుప పైపులకు దండెం తీగను ఒక చివరను హుస్సేన్‌ కుటుంబీకులు కట్టారు. ఇది, క్వార్టర్‌ వెనుక వైపున ఉంది. 225 క్వార్టర్‌లోని సీలింగ్‌ ఫ్యాన్‌ విద్యుత్‌ వైర్లు.. పైకప్పు ఇనుప పైపులకు తగలడంతో వాటికి విద్యుత్‌ ప్రసారమవుతోంది.

ఆ పైపులకు కట్టి ఉన్న దండెం తీగకు విద్యుత్‌ ప్రసరిస్తోంది. ఆ తీగపై ఉన్న టవల్‌ను నజీమా గట్టిగా లాగడంతో అది తెగింది. వారిద్దపై పడింది. అప్పటికే ఆ చిన్నారి స్నానం చేసి ఉన్నాడు. తల్లి నజీమా కూడా తడి బట్టలతో ఉంది. విద్యుత్‌ ప్రసరిస్తున్న ఆ తీగ మీద పడడంతో వారిద్దరూ విద్యుదాఘాతంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

 ‘‘సింగరేణి అధికారులకు పెద్ద క్వార్టర్లు ఉన్నాయి. కార్మికులకు కేటాయించిన క్వార్టర్లు మాత్రం ఇరుకుగా ఉంటున్నాయి. దీంతో మరో (రేకుల) గదిని, వర్షపు నీరు లోపలికి రాకుండా దోణిని కార్మికులే నిర్మించుకుంటున్నారు. హుస్సేన్‌ పక్కనున్న క్వార్టర్‌ కార్మికుడు కూడా ఇలాగే చేశాడు.

ఈ కాలనీలో ఇటీవల కోతుల బెడద ఎక్కువైంది. వాటి కారణంగా కూడా కేబుల్‌ ఇన్స్‌లేషన్‌ ఊడిపోతోంది. దీనిపై ఏరియా ఎలక్ట్రికల్‌ అధికారులు, సిబ్బంది స్పందించడం లేదు. సింగరేణివ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగింది’’ అని, ఈ కాలనీలోని కార్మికులు, వారి కుటుంబీకులు అభిప్రాయపడుతున్నారు. 

ఉన్నతాధికారుల పరిశీలన 

ప్రమాద స్థలాన్ని వర్క్‌షాప్‌ డీజీఎం (ఎలక్ట్రికల్‌) బీడీఎస్‌ ప్రసాద్, ఏజీఎం (పర్సనల్‌) పసుపలేటి శ్రీనివాస్, చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ వి.శ్రీనివాస్‌రావు, కొత్తగూడెం ఏరియా టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షులు ఎండి.రజాక్, చెరిపెల్లి నాగరాజు, టూ టౌన్‌ సీఐ చెన్నూరు శ్రీనివాస్‌ పరిశీలించారు. కొత్తగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబీకులకు పోలీసులు అప్పగించారు. హుస్సేన్‌ స్వగ్రామమైన ఇల్లందులో అంత్యక్రియలు జరిగాయి. 

విచారణకు రానున్న మైనింగ్‌ ఇన్‌స్పెక్టర్‌..? 

ఈ ప్రమాదంపై విచారణకు శవివారం డీడీఎంస్‌ (ఎలక్ట్రికల్‌) రుద్రంపూర్‌ రానున్నట్టు తెలిసింది. ప్రమాదానికి కారణాలను, కారకులను ఆయన గుర్తించనున్నట్టు సమాచారం. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top