ఏ కష్టం వచ్చిందో పాపం

Man Suicide In Guntur East - Sakshi

ఎక్కడి నుంచి వచ్చాడో.. ఏ తల్లి కన్న బిడ్డో.. ఎంత కష్టమొచ్చిందో ఏమో.. అందరూ చూస్తుండగానే భవనం మూడో అంతస్తు నుంచి కిందికి దూకి ప్రాణాలు విడిచాడు. పోలీసులు, స్థానికులు ఎంతగా వారించినా.. అండగా ఉంటామని హామీ ఇచ్చినా చావే శరణ్యం అనుకుని కిందికి దూకేశాడు. ఈ ఘటన గుంటూరు రైలు పేట 3వ లైను రెండో అడ్డరోడ్డులో నిర్మా ణంలో ఉన్న సూర్యతేజ రెసిడెన్సీ వద్ద మంగళవారం జరిగింది.

గుంటూరు ఈస్ట్‌: ఏ కన్న తల్లి బిడ్డో ఏ కష్టం మొచ్చిందో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఎంత మంది బతిమాలిన, తాము అండగా ఉంటామని హామీ ఇచ్చినా  వినలేదు. తనకష్టానికి చావే పరిష్కారమని నిర్ణయించుకున్నాడు. పోలీసులు స్థానికులు కళ్ల ముందు జరుగుతున్న ఘోరాన్ని ఆపాలని, ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు ఆ అభాగ్యుడు అందరి కళ్లముందే భవనంపై నుంచి కిందకు దూకి ప్రాణాలు వదలడం అందరి గుండెలను కలచి వేసింది. ఈ ఘటన రైలుపేట 3వ లైనులో మంగళవారం చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు రైలుపేట 3వ లైను రెండో అడ్డరోడ్డులో సూర్యతేజ రెసెడెన్సీలో 3వ అంతస్తులో నిర్మాణం జరుగుతుంది. గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో  మెట్లు ఎక్కి పైకి వెళ్లడాన్ని కింద ఉన్న వాచ్‌మెన్‌  రాచమాల నాగేశ్వరరావు గుర్తించాడు. నాగేశ్వరరావు వెంటనే 3వ అంతస్తుకు వెళ్లి ఆ వ్యక్తిని ప్రశ్నించాడు. అతడు వెంటనే బ్లేడు బయటకు తీసి దగ్గరకు వస్తే తానూ మెడ తెగ కోసుకుంటానని, భవనంపై నుండి దూకి చనిపోతానంటూ ఉన్మాదంగా ప్రవర్తిస్తూ బెదిరించాడు.

ఆ వ్యక్తి వేరే భాషలో మాట్లాడటంతో పాటు  మత్తులో అదుపు తప్పి ప్రవర్తించాడని వాచ్‌మెన్‌ తెలిపాడు.  వాచ్‌మెన్‌కు అతని భాష అర్థం కాలేదు. వెంటనే కిందకు వెళ్లి 100కు డయల్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలిసిన స్థానికులు బిల్డింగ్‌ కింది భాగంలో గుమిగూడారు. పై అంతస్తులో ఉన్నగుర్తు తెలియని వ్యక్తి ఎవరూ పైకి రావద్దని తానూ కిందకు దూకేస్తానంటూ బెదిరించాడు. విషయం తెలుసుకున్న కొత్తపేట ఎస్‌హెచ్‌వో వంశీదర్‌ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్‌హెచ్‌ఓ, ఎస్‌ఐలు పక్క బిల్డింగ్‌లో పైకి ఎక్కి సూర్యతేజ రెసిడెన్సీౖ పెనున్న  వ్యక్తిని కిందకు దూకవద్దని అతని కోరిక లేమిటో చెబితే తాము సహాయ పడతామంటూ అనేక పర్యాయాలు కోరారు. అదే సమయంలో పోలీసులు కొందరి సహాయంతో జతగా కుట్టిన పట్టాలను ఆ వ్యక్తి కిందకు దూకితే రక్షించడం కోసం  గ్రౌండ్‌ ఫ్లోర్లో పట్టుకున్నారు. పోలీసులు హ్యాండ్‌ మైక్‌ ద్వారా ఆ వ్యక్తిని పదేపదే కిందకు దిగాల్సిందిగా కోరారు. 

సమాచారం అందుకున్న ఫైరింజన్‌ సిబ్బంది 3వ లైను మొదట్లోకి చేరుకున్నారు. గంటపాటు ఆ ప్రాంతంలో హైడ్రామా చోటు చేసుకుంది.  ఫైర్‌ ఇంజిన్‌ చూడటంతో వారు తనను రక్షిస్తారేమోనని ఆందోళన చెందిన  ఆ వ్యక్తి భవనంపై నుంచి వేగంగా ముందుకు దూకాడు. కింద అతడిని రక్షించేందుకు ఏర్పాటు చేసిన పట్టాల అవతలపడి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఆ వ్యక్తికి ఏ కారణం వలనో ముందుగానే నడుము వద్ద రంధ్రం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వ్యక్తిని జీజీహెచ్‌ అత్యవసర విభాగానికి తరలించారు. వైద్యులు ప్రత్యేక చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. తహసీల్దార్‌ నాగిరెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top