
ప్రమాదంలో మృతి చెందిన ఏసు
ఖానాపురం: అంత్యక్రియలకు హాజరై తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. మండలంలోని అశోక్‌నగర్ గ్రామంలో ఓ వ్యక్తి అంత్యక్రియలకు కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబర్‌పేట గ్రామానికి చెందిన బెల్లంకొండ ఏసు(35)తో పాటు మరో నలుగురు బుధవారం హాజరయ్యారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఆటోలో తిరిగి వెళ్తున్న క్రమంలో అయోధ్యనగర్ శివారులో గుర్తు తెలియని ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఆటో బోల్తాపడింది.
ప్రమాదంలో ఏసుకు తీవ్ర గాయాలు కాగా మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అందించారు. ఏసు పరిస్థితి విషమంగా ఉండటంతో ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి వివరాలు సేకరించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.