దివ్య మరెవరికీ దక్కకూడదనే.. 

Man Arrested For Murdering Bank Employee Divya At Siddipet District - Sakshi

బ్యాంకు ఉద్యోగి హత్యకేసులో నిందితుడి అరెస్టు

గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు

కోర్టులో హాజరుపరిచి.. రిమాండ్‌కు తరలింపు

గజ్వేల్‌: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బ్యాంకు ఉద్యోగి దివ్య హత్యకేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేట ఇన్‌చార్జి పోలీస్‌ కమిషనర్‌ శ్వేత గురువారం దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ఈనెల 18న గజ్వేల్‌లో హత్యకు గురైన దివ్య తండ్రి లక్ష్మీరాజం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేములవాడకు చెందిన వెంకటేశ్‌గౌడ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం రాత్రి వేములవాడలో ప్రత్యేక బృందం పోలీసులు వెంకటేశ్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. హత్య అనంతరం వెంకటేశ్‌ అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు వెళ్ళాడని, ఆ తర్వాత రైలులో విజయవాడకు, అక్కడి నుంచి వరంగల్‌ మీదుగా బుధవారం రాత్రి వేములవాడకు వచ్చాడని పోలీసులు తెలిపారు. తనకు దక్కని దివ్య మరెవరికీ దక్కకూడదనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు విచారణలో వెంకటేశ్‌ చెప్పాడని, నిందితునికి కఠిన శిక్ష పడేలా చూస్తామని ఇన్‌చార్జి సీపీ పేర్కొన్నారు. కేసును 24 గంటల్లో ఛేదించిన గజ్వేల్‌ ఏసీపీ నారాయణ, సీఐ ఆంజనేయులు, సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ శ్వేత అభినందించారు.

నిందితునికి వైద్య పరీక్షలు  
అరెస్టు అనంతరం నిందితుడు వెంకటేశ్‌గౌడ్‌ను గజ్వేల్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ప్రాంగణం వద్ద విలేకరులు వెంకటేశ్‌గౌడ్‌ను సంఘటనకు దారితీసిన పరిస్థితులపై ప్రశ్నించగా.. అతను నోరు విప్పలేదు. సుమారు 15 నిమిషాలపాటు వైద్య పరీక్షలు సాగాయి. ఆ తర్వాత పోలీసులు అతడిని గట్టి బందోబస్తు మధ్య గజ్వేల్‌లోని కోర్టులో హాజరు పరిచి, రిమాండ్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top