చోరీ డాట్‌ కామ్ @ల్యాప్‌టాప్‌ | Laptops Robberies in Karnataka | Sakshi
Sakshi News home page

చోరీ డాట్‌ కామ్ @ల్యాప్‌టాప్‌

Jan 31 2019 11:58 AM | Updated on Jan 31 2019 11:58 AM

Laptops Robberies in Karnataka - Sakshi

సాక్షి బెంగళూరు: దొంగలు ట్రెండ్‌ మార్చారు. ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకున్నారు. చోరీ వస్తువులను బహిరంగంగా విక్రయించకుండా ఆన్‌లైన్‌ వేదికగా విక్రయాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా డిమాండ్‌ ఉన్న ల్యాప్‌టాప్‌లను టార్గెట్‌ చేసి చోరీలకు పాల్పడి తర్వాత వెబ్‌సైట్లలో ఉంచి  కనిష్టంగా రూ. 15 వేల నుంచి రూ. 40 వేల వరకు విక్రయిస్తున్నారు.

కారు అద్దాలు ధ్వంసం చేసి చోరీలు
ప్రైవేటు కంపెనీ ఉద్యోగి నిలిన్‌ ఈ నెల 20న రాత్రి తన కారులో వచ్చి హెచ్‌ఎస్‌ఎర్‌ లేఔట్‌లోని ఒక రెస్టారెంట్‌ ముందు ఆపి ఆ హోటల్లోకి వెళ్లగా  దుండగులు అద్దాలు ధ్వంసం చేసి అందులోని ఆపిల్‌ మ్యాక్‌బుక్, ల్యాప్‌టాప్‌ చోరీచేశారు. ఇదే పోలీసు స్టేషన్‌ పరిధిలోని మరో రెస్టారెంట్‌లో రజత్‌భట్‌ అనే వ్యక్తి భోజనం చేసి వచ్చి చూసే సరికి కారు అద్దాలు పగులకొట్టి ల్యాప్‌టాప్, పర్సు, డెబిట్‌ కార్డులను చోరీ చేశారు. ఇలాంటి ఘటనలపై నెలకు 50కేసుల వరకు నమోదవుతున్నాయి.

ఆన్‌లైన్‌ మార్కెట్లో లభ్యం...
 దొంగలు తాము చోరీ చేసిన ల్యాప్‌టాప్‌లను మొదట కేవలం ఎస్పీ రోడ్డు, నేషనల్‌ మార్కెట్, హాంకాంగ్‌ బజార్‌ తరహాలో అమ్మేవారు.అయితే పోలీసుల  భయంతో వాటిని ఆన్‌లైన్‌ద్వారా విక్రయిస్తున్నారు.  కేవలం దొంగలు మాత్రమే ఈ పని చేయడం లేదని, కాలేజీ విద్యార్థులు కూడా డబ్బు కోసం ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.

గుర్తించడం చాలా కష్టం..
 రోజూ ఆన్‌లైన్‌లో వేలాది సెకెండ్‌ హ్యాండ్‌ ల్యాప్‌టాప్‌లు విక్రయానికి వస్తున్నాయి. వీటిలో దొంగతనానికి గురైన వాటిని గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. ఆన్‌లైన్‌లో లభించే వాటిలో దాదాపు 75 శాతం దొంగిలించనవేనని పోలీసులు చెబుతున్నారు.  సాధారణంగా అయితే ఆయా చోర్‌ బజార్లలో లభించేవాటినైతే స్వాధీనం చేసుకుని దొంగను అరెస్టు చేయవచ్చు. కానీ ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన వారిని కనుగొనడం, ఆ వస్తువులను స్వాధీనం చేసుకోవడం చాలా కష్టమైన పని అని పోలీసులు చెబుతున్నారు.

జీపీఎస్‌ ట్రాకర్‌ ఉంటే మేలు..
ల్యాప్‌టాప్‌లకు జీపీఎస్‌ ట్రాకర్లను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. స్టిక్కర్ల రూపంలో జీపీఎస్‌ ట్రాకర్లు మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిని ల్యాప్‌టాప్‌కు అంటించుకోవాలి. ల్యాప్‌టాప్‌ను చోరీ చేసిన దుండగులు నెట్‌వర్క్‌ కార్డు మార్చుతుంటారు. ఇందుకు  ఇంటర్‌నెట్‌ ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ల్యాప్‌టాప్‌కు అంటించిన జీపీఎస్‌ ట్రాకర్‌ పని చేయడం మొదలై దొంగను ఇట్టే పట్టేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement