
బాధిత చిన్నారి తన్యశ్రీ
ప్రకాశం, మిట్టపాలెం (కొండపి): ఓ దుండగుడు పూరిగుడిసె జోలెలో ఉన్న పాపను అపహరించేందుకు విఫలయత్నం చేశాడు. అప్రమత్తమైన తల్లి అతడి కళ్లల్లో కారం చల్లి బిడ్డను కాపాడుకుంది. ఈ సంఘటన మండలంలోని మిట్టపాలెంలో మంగళవారం సాయంత్రం జరిగింది. గ్రామస్తుల సమాచారం ప్రకారం.. మిట్టపాలెం మాలపల్లెలో రోడ్డుకు దగ్గరలో నివాసం ఉంటున్న ధర్నాసి రజని, ఈశ్వరయ్య దంపతులకు ఒకటిన్నర సంవత్సరం పాప తన్యశ్రీ ఉంది. తల్లి రజని తన కుమార్తెను ఇంట్లో జోలెలో పండుకోబెట్టి బయటకు వెళ్లింది.
రజని తిరిగి ఇంటికి రాగా దుండగుడు జోలెలో ఉన్న పాప చేతులు వైర్‌తొ కట్టి తీసుకెళ్లడం గమనించింది. సమయస్ఫూర్తిగా వ్యవహరించిన తల్లి పరుగున ఇంట్లోకి వెళ్లి డబ్బాలోని కారం తెచ్చి దుండగుడి కళ్లల్లో చల్లింది. పాపను కింద పడేసిన దుండగుడు తన బైక్‌పై కొండపి వైపు ఉడాయించాడు. దుండగుడు గుండు చేయించుకుని గడ్డం పెంచుకుని నల్లగా ఉన్నట్లు పాప తల్లి రజని చెబుతోంది. ఎస్‌ఐ చంద్రశేఖర్ తన సిబ్బందితో కలిసి మిట్టపాలెం వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ఎస్‌ఐ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా కేసును విచారిస్తున్నామని బదులిచ్చారు.