తీర్థయాత్రలకు వెళ్లొస్తూ.. 

Journalist Family Died In Siddipet Road Accident - Sakshi

తల్లిదండ్రులు, కుమారుడు, మనవళ్లు, బంధువులు మృతి 

విషాదంలో మునిగిపోయిన సంగారెడ్డి జిల్లా పెద్దమ్మగూడెం 

వారు బయలుదేరింది తీర్థయాత్రలకు.. వరుసగా పుణ్యక్షేత్రాలు తిరిగి ఇంటిబాట పట్టారు.. కానీ మృత్యువు వారిని మధ్యలోనే కబళించింది.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని బలితీసుకుంది.. మరికొందరు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.. సంగారెడ్డి జిల్లా జిన్నారం గ్రామశివారులోని పెద్దమ్మగూడెంకు చెందిన గొర్ల లక్ష్మణ్‌ కుటుంబం వ్యథ ఇది. 

గజ్వేల్‌: గొర్ల లక్ష్మణ్‌ (38) నవ తెలంగాణ పత్రిక జిన్నారం మండల రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. తీర్థయాత్రల కోసమని శుక్రవారం సాయంత్రం తండ్రి చిన్నమల్లేశ్‌ (65), తల్లి గండెమ్మ(58), భార్య పుష్పలత (30), కుమారుడు ఆకాశ్‌ (11), కుమార్తెలు నిహారిక (7), విజయ(5), సోదరి కుమార్తె శృతి (8)లతోపాటు మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం వెంకటరత్నాపూర్‌కు చెందిన అత్త ఇల్టం సత్తమ్మ (60), బావమరిది నర్సింలు, ఆయన భార్య ధనలక్ష్మి, వారి కుమారుడు శ్రీనివాస్‌ (8), తూప్రాన్‌కు చెందిన సమీప బంధువు గాజుల సుశీల (62), మరికొందరితో కలసి క్వాలిస్‌ వాహనంలో బయలుదేరారు. రాత్రికి వేములవాడలో దర్శనం చేసుకుని బసచేశారు. శనివారం తెల్లవారుజామునే బయలుదేరి కొండగట్టు, యాదగిరిగుట్ట, కొమురవెల్లి ఆలయాలను దర్శించుకున్నారు.

అక్కడి నుంచి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. రాజీవ్‌ రహదారిపై ప్రయాణిస్తున్న వారు.. మరో పది నిమిషాలైతే ఆ రహదారిని వదిలేసి, తమ ఊరికి వెళ్లే చిన్నరోడ్డుకు మారేవారు. కానీ గజ్వేల్‌ మండలం రిమ్మనగూడ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో లక్ష్మణ్‌తోపాటు తల్లిదండ్రులు, కుమార్తె నిహారిక, అత్త సత్తమ్మ, బావమరిది కుమారుడు శ్రీనివాస్, సమీప బంధువు గాజుల సుశీల అక్కడికక్కడే మృతి చెందా రు. కుమారుడు ఆకాశ్, విజయ, శృతిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఆకాశ్, విజయల పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. శృతి గజ్వేల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. భర్తను, కుమార్తెను, అత్తామామలను, తల్లిని, మేనల్లుడిని కోల్పోయిన పుష్పలత తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 

పదేళ్లుగా విలేకరిగా కొనసాగుతున్న లక్ష్మణ్‌  
లక్ష్మణ్‌ జిన్నారం మండల విలేకరిగా పదేళ్లుగా కొనసాగుతున్నారు. తొలుత సూర్య, వార్త పత్రికలకు పనిచేశారు. ప్రస్తుతం సూరారంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలో లైబ్రేరియన్‌గా విధులు నిర్వర్తిస్తూ, నవ తెలంగాణ విలేకరిగా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు ఆకాశ్‌ ఓ ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతుండగా.. పెద్ద కుమార్తె నిహారిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top