‘ఇన్‌స్టాగ్రామ్‌’తో ఆచూకీ దొరికింది

Instagram Chased Student Missing Case in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: కాలేజీకి సెలవులు ముగిసినా ఎందుకు వెళ్లడం లేదని తండ్రి ప్రశ్నించడంతో 11 రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్థిని ‘ఇన్‌స్టాగ్రామ్‌’ పట్టించింది. సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ జలేందర్‌ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, లయపల్లి గ్రామానికి చెందిన దొసపాటి రాందాస్‌ కుమారుడు నివాస్‌గౌడ్‌ హయత్‌నగర్‌లోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియేట్‌ చదువుతున్నాడు. కాలేజీకి నాలుగురోజుల పాటు సెలవులు ఇవ్వడంతో జూలై 20 నుంచి 24 వరకు ఇంట్లోనే ఉన్నాడు. అయితే తిరిగి కాలేజీ ప్రారంభం కావడంతో ఎందుకు వెళ్లడం లేదని తండ్రి ప్రశ్నించడంతో భయపడ్డాడు. హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేని నివాస్‌గౌడ్‌ బైక్‌ తీసుకొని కనిపించకుండా పోయాడు. అతడి కోసం గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో రాందాస్‌ గత నెల 25న మంచాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయితే పిటీషన్‌లో కంటెంట్‌ ఆధారంగా టెక్నికల్‌ సహాయం కోసం రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ చేపట్టగా నివాస్‌గౌడ్‌ పేరుతో ‘ఇన్‌స్టాగ్రామ్‌’ అకౌంట్‌ ఉపయోగిస్తున్నట్లు తెలుసుకొని ఆ దిశగా లాగిన్, లాగౌట్‌ ఐపీ అడ్రస్‌లు ఫేస్‌బుక్‌ ఇంక్‌ 1601కు లేఖ రాసి తెప్పించారు. మొబైల్‌ నంబర్‌ ఆధారంగా సర్వీసు ప్రొవైడర్‌ నుంచి టవర్‌ లోకేషన్లు గుర్తించి సికింద్రాబాద్‌ పద్మారావునగర్‌లో ఉన్నట్లు గుర్తించాం. అదివారం రాత్రి 70 ఎంఎం టిఫిన్‌ సెంటర్‌ వద్ద సప్లయర్‌గా పని చేస్తున్న నివాస్‌గౌడ్‌ను పట్టుకున్నారు. హోటల్‌లో పనిచేయడమేంటని ప్రశ్నిస్తే కాలేజీ హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేదని, డేస్కాలర్‌గా వెళ్లొస్తానని చెప్పినా తల్లిదండ్రులు పట్టించుకోలేదని తెలిపాడు. ఈ కేసులో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అకుంఠిత దీక్షతో పనిచేయడం వల్ల తన కుమారుడి అచూకీ లభించిందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. తదుపరి విచారణ కోసం నివాస్‌గౌడ్‌ను మంచాల పోలీసులకు అప్పగించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top