
న్యూయార్క్ : విడాకులు కోరిన భార్యను దారుణంగా హతమార్చిన భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని స్థానిక కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసులో ఆగస్టు 23న అతడికి శిక్ష ఖరారు చేయనుంది. వివరాలు... భారత్‌కు చెందిన అవతార్ గ్రెవాల్(44), నవనీత్ కౌర్‌లకు 2005లో వివాహం జరిగింది. ఉద్యోగ కారణాల రీత్యా పెళ్లైన కొన్ని రోజుల తర్వాత అవతార్ కెనడాకు వెళ్లగా, నవనీత్ అమెరికాకు వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో రెండేళ్ల తర్వాత భర్త నుంచి విడిపోవాలని నవనీత్ నిర్ణయించుకుంది. కానీ అవతార్ మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు.
కాగా ఈ విషయం గురించి అవతార్‌ను ఒప్పించేందుకు తన ఇంటికి రావాల్సిందిగా నవనీత్ అతడిని కోరింది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టుకు వచ్చి మరీ అతడిని రిసీవ్ చేసుకుంది. ఇంటికి వెళ్లిన తర్వాత విడాకుల విషయమై ఇద్దరు చర్చిస్తున్న సమయంలో కోపోద్రిక్తుడైన అవతార్.. నవనీత్‌పై దాడి చేశాడు. తర్వాత ఆమెను బాత్‌టబ్‌లో ముంచి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి కెనడాకు పారిపోయాడు. ఈ క్రమంలో నవనీత్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అమెరికాకు తీసుకువచ్చి అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం కోర్టు అవతార్‌ను దోషిగా తేల్చింది.