భార్యపై భర్త లైంగిక ఉన్మాదం 

Husband Molested Wife In Hospital At chittoor - Sakshi

ఆస్పత్రిలో కూతురికి వైద్యం చేయిస్తున్న భార్యపై పైశాచికత్వం 

కోరిక తీర్చాలంటూ దాడి 

అంతర్గత అవయవాలు దెబ్బతినడంతో కోమాలోకి వెళ్లిన మహిళ

నిందితుడిపై హత్యాయత్నం కేసు.. అరెస్టు

చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఘటన

చిత్తూరు అర్బన్‌ : తాగినమైకం.. కామంతో కళ్లు మూసుకుపోయాయి.. కోరినప్పుడు భార్య తన కోరిక తీర్చాల్సిందే అన్న రాక్షసత్వం బయటకు వచ్చింది. ఏ పరిస్థితుల్లో తన భార్య ఉందో.. తామెక్కడ ఉన్నామో అన్నవిషయం మర్చిపోయి ఉన్మాదిలా మారిపోయాడు ఓ కామాంధుడైన భర్త. భార్యపైనే దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ మృగాడి దాడితో ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మనిషిలోని పైశాచికత్వానికి పరాకాష్టగా నిలిచిన ఈ దారుణ ఘటన చిత్తూరులో జరిగింది.

స్థానిక ఇరువారం దళితవాడకు చెందిన మహిళకు యాదమరి మండలం పాపిశెట్టిపల్లెకు చెందిన కూలి పనిచేసే నందతో (37)తో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలున్నారు. 16 ఏళ్లున్న పెద్దమ్మాయికి ఇటీవల జ్వరం రావడంతో 3 రోజులుగా చిత్తూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అప్పటి నుంచి తన ఇద్దరు పిల్లలతో కలిసి పద్మ ఆసుపత్రిలోనే ఉంటోంది. మద్యం సేవించిన నంద ఆదివారం రాత్రి ఆస్పత్రిలో ఉన్న పద్మ వద్దకు వెళ్లి తన లైంగిక కోరిక తీర్చమని బలవంతం చేశాడు. కుమార్తె అనారోగ్యంతో ఆస్పత్రిలో బాధపడుతుంటే ఇదేం పనంటూ ఆమె భర్తపై కోపగించుకుంది.

ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ నందను బయటకు పంపించేశాడు. అయితే రాత్రి 11 గంటల సమయంలో మళ్లీ ఆసుపత్రికి వచ్చిన నంద, తన భార్యను మభ్యపెట్టి పిల్లల వార్డు మిద్దెపైకి తీసుకెళ్లాడు. తన కోర్కెను తీర్చాలంటూ బలవంతం చేయగా ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన నంద విచక్షణ కోల్పోయి భార్యను తీవ్రంగా కొట్టాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేసి చీరతో గొంతు నులిమి హత్య చేయడానికి ప్రయత్నించాడు. తీవ్ర రక్తస్రావం మధ్య వివస్త్రగా పడున్న పద్మను సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఆమె రెండో కుమార్తె గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చింది.

అనంతరం పద్మను అత్యవసర విభాగానికి తరలించి ప్రాథమిక చికిత్స అందించినా కోలుకోకపోవడంతో ఆసుపత్రిలోని ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం కోమాలో ఉన్న పద్మకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. లైంగిక దాడిలో అంతర్గత అవయవాలు సైతం తీవ్రంగా దెబ్బతినడంతో మరో 24 గంటలు గడిస్తే తప్ప ఆమె ఆరోగ్య పరిస్థితిని ఏమీ చెప్పలేమని వైద్యులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రిలోనే నందను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ ఉన్మాదిని తమకు అప్పగించాలంటూ పద్మ బంధువులు పోలీసుల వాహనానికి అడ్డుతగలడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం నందపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top