నా స్నేహితుడిని పెళ్లి చేసుకో..

Husband Forced To Marry his Friend Wife Case Filed - Sakshi

భార్యను కోరిన వ్యక్తి

కొత్తపేటలో కేసు నమోదు

సహకరించిన అత్తింటివారిపై బాధితురాలి ఫిర్యాదు

చిట్టినగర్‌ (విజయవాడ వెస్ట్‌) : తన స్నేహితుడిని పెళ్లి చేసుకోమని భర్త..., భర్త తీరును అత్తమామలకు చెబితే.. కొడుకు చెప్పినట్లు నడుచుకోమన్న అత్తంటి వారి తీరుపై ఓ వివాహిత గురువారం కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కొత్తపేట పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పాత రాజరాజేశ్వరిపేట జెండా చెట్టు ప్రాంతానికి చెందిన ఎండీ. మల్లికా సుల్తానా (27) కు భవానీపురానికి చెందిన రియాజ్‌తో గత ఏడాది జూన్‌ 19వ తేదీన వివాహం జరిగింది. అయితే సుల్తానాకు గతంలో వివాహం కాగా విడాకులు తీసుకుంది. రియాజ్‌కు మరో మహిళతో వివాహం జరగగా విడిపోయారు. ఇద్దరికి రెండో వివాహం. అయితే వివాహ సమయంలో కట్నంతో పాటు బంగారు, వెండి వస్తువులు, లాంఛనాలు ఇచ్చారు. రియాజ్‌ పాత టైర్ల వ్యాపారం చేస్తుంటాడు. రియాజ్‌ స్నేహితుడైన సయ్యద్‌ అబ్దుల్‌ రహమాన్‌ అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేవాడు.

కడప జిల్లాకు చెందిన రహమాన్‌ నగరానికి వచ్చినప్పుడల్లా భార్య బషీరాను తీసుకుని స్నేహితుడి ఇంటికి వచ్చేవాడు. కొన్ని నెలల కిందట సుల్తానా ఇంట్లో ఉన్న సమయంలో నువ్వు అంటే నాకు ఇష్టం.. నీ భర్తకు విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలని బెదిరించేవాడు. అంతే కాకుండా నువ్వు స్నానం చేస్తున్న వీడియో నా దగ్గర ఉంది.. అంటూ బెదిరింపులకు పాల్పడేవాడు. ఇదే రీతిలో బెదిరించి సుల్తానా దగ్గర ఉన్న 18 కాసుల నగలు తీసుకెళ్లిపోయాడు. ఇదే విషయం భర్తకు చెప్పగా మౌనంగా ఉండిపోవడంతో తన ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాలేదు. ఇంతలో రెహమాన్‌ భార్య బషీరా ఫోన్‌ చేసి నా భర్త నిన్ను ప్రేమిస్తున్నాడు.. పెళ్లి చేసుకో.. నాకు అభ్యంతరం లేదని చెప్పడంతో సుల్తానా కన్నీరు మున్నీరయ్యింది.

ఈ క్రమంలో ఓరోజు సుల్తానాతో భర్త రియాజ్‌ మాట్లాడుతూ రహమాన్‌తో ఉండటం మాకేం అభ్యంతరం లేదని, వ్యాపార అవసరాల కోసం కొంత అప్పు కూడా ఇచ్చాడని, ఇప్పుడు కాదంటే ఆ డబ్బుల కోసం ఇబ్బంది పెడతాడని భార్యతో చెప్పాడు. లేదంటే పుట్టింటికి వెళ్లి రూ.5 లక్షలు తీసుకురావాలని వేధించడంతో సుల్తానా ససేమిరా అంది. దీంతో రియాజ్‌ భార్యను బాగా కొట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని చెప్పడంతో పుట్టింటికి చేరింది. రియాజ్‌తో పాటు అన్న జాఫర్‌ హుస్సేన్, చెల్లెలు అఫ్రోజ్, మేనల్లుడు సయ్యద్‌ షాదిక్, రహమాన్‌ భార్య బషీరా తనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top