
పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన చొగలా మల్లిక్
బరంపురం: గంజాం–నయగడా జిల్లాల సరిహద్దులో మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ చొగలా మాల్లిక్ పోలీసుల కాల్పుల్లో మృతిచెందాడు. పోలీసులు, గ్యాంగ్‌స్టర్ మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో చొగలా మల్లిక్ తొలుత గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. చొగలా మల్లిక్ ఇద్దరు సహచరులు తప్పించుకున్నారు. ఈ సందర్భంగా నయాగడ పోలీసు అధికారులు అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
గురువారం అర్ధరాత్రి 12గంటల సమయంలో రెండు జిల్లాలకు మోస్ట్‌వాంటెడ్ చొగలా మల్లిక్ సహచరులతో వస్తున్నట్లు నయగడా ఎస్‌పీకి రహస్య సమచారం అందింది. దీంతో గంజాం పోలీసుల సహాయంతో నయాగడ, రణపూర్ పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి రెండు జిల్లాల సరిహద్దు నవఘనపూర్‌లో మాటువేశారు.
సరిగ్గా రాత్రి 12 గంటల సమయంలో సహచరులతో కలిసి చొగలామల్లిక్ బైక్‌పై వస్తున్న సమయంలో పోలీసులను చూసి తొలుత పోలీసులపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణగా ఎదురుకాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నేరస్థుడు చొగలా మల్లిక్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చొగలా మల్లిక్ సహచరులిద్దరూ పరారయ్యారు.
నేరస్తుడిపై 30కి పైగా కేసులు
కాల్పుల అనంతరం సంఘటనా స్థలం నుంచి ఒక విదేశీ తుపాకీ, 3 పేలని గుళ్లు, ఒక మోబైల్, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గాయపడిన నేరస్తుడిని చికిత్స కోసం కటక్ పె ద్దాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన చొగలా మల్లిక్..పోలీసుల లిస్ట్‌లో మోస్ట్‌వాంటెడ్. చొగలా మల్లిక్‌పై సుమారు 30కి పైగా దోపిడీ, దొంగతనం, హత్యాదాడులు వంటి నేరాలు నమోదై ఉన్నాయని పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. తప్పించుకున్న చొగలామల్లిక్ సహచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.