రిక్షా తొక్కే స్థాయినుంచి.. మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌గా...

From Rickshaw Puller To Most Wanted Criminal Hyder Crime History - Sakshi

భువనేశ్వర్‌ : మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ హైదర్‌ శనివారం పోలీసుల కాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే. చౌద్వార్‌ సర్కిల్‌ జైలు నుంచి బరిపద జైలుకు తరలిస్తుండగా అతడు తప్పించుకోవటానికి ప్రయత్నించటంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలోనే అతడు మృత్యువాతపడ్డాడు. దాదాపు 10 సంవత్సరాలకు పైగా రాష్ట్ర పోలీసులను ముప్పతిప్పలుపెట్టిన అతడు జీవితపు తొలినాళ్లలో రిక్షా నడిపేవాడు. అతడి పూర్తి పేరు రఫ్పియన్‌ షేక్‌ హైదర్‌.  1990నుంచి 2000 సంవత్సరం వరకు వరుస హత్యలు, కిడ్నాపులతో గ్యాంగ్‌స్టర్‌గా హైదర్‌ పేరు మార్మోగింది.

అయితే, రెండు హత్యల్లోనే నేరుగా ఇన్‌వాల్వ్‌ అయ్యాడు. మిగిలిన అన్ని నేరాలను అతడి గ్యాంగ్‌ చేసింది. రెండు హత్యల్లోనూ అతడి యావజ్జీవ శిక్ష పడింది. జైలులో ఉంటూనే తన గ్యాంగ్‌తో నేరాలకు పాల్పడేవాడు. 1991లో గ్యాంగ్‌స్టర్‌ బుల సేతిని కోర్టు ఆవరణలో కాల్చి చంపటంతో హైదర్‌ పేరు రాష్ట్రమంతటా మారుమోగింది. 1997లో పోలీసుల కాల్పుల్లో ఓ సారి తీవ్రంగా గాయపడ్డాడు. 2005లో హైదర్‌ గ్యాంగ్‌ ఓ ఇద్దరు వ్యక్తుల్ని కాల్చి చంపింది. ఈ నేరంలో పోలీసులు హైదర్‌ను అరెస్ట్‌ చేశారు. 2011లో కోర్టు అతడికి యావజ్జీవ శిక్ష విధించింది.

2017లో సెక్యూరిటీ కారణాల వల్ల అతడ్ని ఘర్‌పాదా జైలునుంచి శంబల్‌పుర్‌ జైలుకు తరలించారు. అనారోగ్య కారణాలతో ఆసుపత్రి చేరిన హైదర్‌ ఏప్రిల్‌ 10న అక్కడినుంచి పారిపోయాడు. కానీ, పోలీసులు పట్టుకుని కటక్‌లోని చౌద్‌వార్‌ జైలుకు తరలించారు. అయితే, కొన్ని భద్రతా కారణాల వల్ల శనివారం అతడ్ని చౌద్‌వార్‌ నుంచి బరిపద జైలు తరలించటానికి వ్యానులో ఎక్కించారు. ఈ నేపథ్యంలో హైదర్‌ తప్పించుకోవటానికి ప్రయత్నించగా  పోలీసులు కాల్చిచంపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top