పసిమొగ్గను చిదిమేశారు | Baby girl Raped and murdered | Sakshi
Sakshi News home page

పసిమొగ్గను చిదిమేశారు

Dec 8 2017 2:17 AM | Updated on Jul 30 2018 8:37 PM

Baby girl Raped and murdered - Sakshi

మనోహరాబాద్‌ (తూప్రాన్‌): పసి మొగ్గను చిదిమేశారు. అభం శుభం తెలియని చిన్నారిని కామాంధులు కాటేశారు. చదువుకోవడానికి బడికి వెళ్లిన పాపను కిడ్నాప్‌ చేసి, అత్యాచారం జరిపి పాశవికంగా హత్య చేశారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం ముప్పిరెడ్డిపల్లిలో గురువారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. బిహార్‌ రాష్ట్రంలోని చాప్రా జిల్లా నయాగావ్‌ గ్రామానికి చెందిన ఎండీ కలాం, హసీనా దంపతులు కొద్ది రోజుల క్రితం బతువుదెరువు కోసం ముప్పిరెడ్డిపల్లికి వచ్చారు.

స్థానికంగా ఉన్న కేబీ ఇంజనీరింగ్‌ పరిశ్రమలో పనిచేస్తూ జీవిస్తున్నారు. వీరికి కొడుకు సయ్యద్, కూతురు ఖుష్భూ (6) ఉన్నారు. వీరిని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. రోజు మాదిరిగానే పిల్లలిద్దరూ బుధవారం పాఠశాలకు వెళ్లారు. కానీ, ఖుష్బూ సాయంత్రం ఇంటికి చేరుకోకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. రాత్రి వరకు ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు.

అయితే.. గురువారం ఉదయం గ్రామ శివారులో వెతుకుతుండగా మోండికుంట కల్వర్టు కింద ఉన్న పైపులో ఖుష్బూ విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్‌ టీంను రంగంలోకి దించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహం పడి ఉన్న తీరును బట్టి చిన్నారిపై ముందు అత్యాచారం చేసి హతమార్చి ఉంటారని భావిస్తున్నారు.

అన్నికోణాల్లో దర్యాప్తు: డీఎస్పీ
ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తూప్రాన్‌ డీఎస్పీ రాంగోపాల్‌రావు చెప్పారు. పాప మీద అత్యాచారం చేసి.. చంపి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. కాగా, ఎస్పీ చందన దీప్తి గురువారం ఉదయం ఘటన స్థలాన్ని సందర్శించారు. స్థానికులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాల పరిసరాలను పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. పూర్తిస్థాయి విచారణ జరిపి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement