
న్యూఢిల్లీ: తాజాగా పెట్టుబడులు సమకూర్చుకోవడం, డిజిటల్ కార్యకలాపాల జోరును మరింత పెంచుకోవడం లక్ష్యంగా వ్యూహాత్మక భాగస్వామి కోసం యస్ బ్యాంక్ అన్వేషిస్తోందని సమాచారం. దీంట్లో భాగంగా మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌తో పాటు మరో రెండు అగ్రశ్రేణి దిగ్గజ కంపెనీలతో ఈ బ్యాంక్ సంప్రదింపులు జరుపుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. మూడు వారాల క్రితం మొదలైన ఈ చర్చలు ఫలప్రదమైతే, 15 శాతం వాటాకు సమానమైన తాజా ఈక్విటీ షేర్లను ఆయా కంపెనీలకు యెస్ బ్యాంక్ జారీ చేస్తుంది. మైక్రోసాఫ్ట్‌తో యస్‌బ్యాంక్ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. అన్నీ అనుకూలిస్తే, యెస్ బ్యాంక్‌లో మైక్రోసాఫ్ట్ రూ.2,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయి.
మైక్రోసాఫ్ట్ ముందుకు వస్తే, ఈ బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్, పేమెంట్ సిస్టమ్ ప్రణాళికలకు కూడా మరింత జోష్ వస్తుంది. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్‌కు ఒక డైరెక్టర్ పదవి కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ వాటా విక్రయానికి ఒక ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌ను కూడా యస్ బ్యాంక్ నియమించిందని, ఈ విషయాలన్నీ ఆర్‌బీఐకు తెలిసే జరుగుతున్నాయని సమాచారం. కాగా ఈ విషయమై తామేమీ వ్యాఖ్యానించలేమని మైక్రోసాఫ్ట్, యస్ బ్యాంక్ ప్రతినిధులు స్పష్టం చేశారు.
నిధుల సమీకరణ సాధారణ విషయమే...
కాగా వ్యాపార అవసరాలకు కావలసిన మూలధనం సమీకరణ ప్రయత్నాలను కొనసాగిస్తున్నామని యస్ బ్యాంక్ సోమవారం తెలిపింది. సెక్యూరిటీల జారీ ద్వారా ఇన్వెస్టర్లు, సంస్థల నుంచి మూలధనాన్ని సమీకరించడం సాధారణ విషయమేనని పేర్కొంది. వ్యాపార అవసరాలు, నియంత్రణ సంస్థల నిబంధనల పాటింపు కోసం నిధులు అవసరమని వివరించింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఈ బ్యాంక్ వివరణ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్, పీఈ సంస్థల నుంచి నిధుల సమీకరించడానికి యస్ బ్యాంక్ సంప్రదింపులు జరుపుతోందన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో యెస్ బ్యాంక్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీలు వివరణ కోరాయి.
నిధుల సమీకరణ కోసం వివిధ సంస్థలతో సంప్రదింపుల జరపడం సాధారణ విషయమేనని యస్ బ్యాంక్ పేర్కొంది. అయితే మైక్రోసాఫ్ట్, ఇతర సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామన్న వార్తలు తమకు తెలియవని వివరించింది. ఇలాంటి వార్తలపై వ్యాఖ్యానించడం తమ విధానం కాదని పేర్కొంది. కొన్ని పీఈ(ప్రైవేట్ ఈక్విటీ) సంస్థలు కూడా ఆసక్తి కనబరుస్తున్నాయి. టీపీజీ, కార్లైల్ గ్రూప్, ఫరలూన్ క్యాపిటల్ సంస్థలు యస్ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని సమాచారం. ప్రస్తుత ధర వద్ద యస్ బ్యాంక్ ఆకర్షణీయంగా ఉండటమే దీనికి కారణమని నిపుణులంటున్నారు. ఇటీవలనే ఈ బ్యాంక్ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపీ) విధానంలో రూ.1,930 కోట్ల నిధులు సమీకరించింది.
షేరు జోరు..
నిధుల కోసం మైక్రోసాఫ్ట్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయన్న వార్తల కారణంగా యస్ బ్యాంక్ షేర్ సోమవారం కూడా జోరుగా పెరిగింది. స్టాక్ మార్కెట్ నష్టపోయినా ఈ షేర్ 8 శాతం లాభంతో రూ. 45.60 వద్ద ముగిసింది. కాగా, గత రెండు రోజుల్లో షేరు 40 శాతం మేర ఎగబాకడం గమనార్హం. గతేడాది ఆగస్టులో రూ.404గా ఉన్న షేర్ ధర ఏడాది కాలంలోనే దాదాపు 90 శాతం పతనమై తాజాగా 29 కనిష్టాన్ని కూడా తాకింది. మొండి బకాయిలు భారీగా పెరగడం, ఇతర పాలనాపరమైన సమస్యలు బ్యాంక్‌పై ప్రభావం చూపుతున్నాయి.