యస్‌ బ్యాంక్‌కు  రూ.1,506 కోట్ల నష్టం 

YES Bank reports surprise Q4 loss of Rs 1,507 crore - Sakshi

పది రెట్లు పెరిగిన కేటాయింపులు

ఒక్కో షేర్‌కు రూ.2 డివిడెండ్‌ 

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ యస్‌బ్యాంక్‌కు నాలుగో క్వార్టర్లో భారీగా నష్టాలు వచ్చాయి. గత క్యూ4లో రూ.1,507 కోట్ల నికర నష్టాలు  వచ్చాయని యస్‌ బ్యాంక్‌ తెలిపింది. 2017–18 క్యూ4లో రూ.1,179 కోట్ల నికర లాభం సాధించామని పేర్కొంది.  మొండి బకాయిలకు కేటాయింపులు భారీగా పెరగడం వల్ల ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వివరించింది. రద్దు చేసిన రూ.831 కోట్ల రుణాలను పరిగణనలోకి తీసుకుంటే నష్టాలు మరింతగా పెరిగేవి.  ఇవి సీఈఓగా రాణా కపూర్‌ నిష్క్రమణ, కొత్త సీఈఓగా రవ్‌నీత్‌ గిల్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత వెలువడిన తొలి ఫలితాలు.  

16 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం... 
గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో నికర వడ్డీ ఆదాయం 16 శాతం పెరిగి రూ.2,506 కోట్లకు చేరింది.  ఇతర ఆదాయం 63 శాతం పతనమై రూ.538 కోట్లకు తగ్గింది. నిర్వహణ లాభం 38 శాతం తగ్గి రూ.1,323 కోట్లకు పరిమితమైంది. నికర నష్టాలు వచ్చినా, మొత్తం ఆదాయం మాత్రం పెరిగిందని పేర్కొంది. 2017–18 క్యూ4లో రూ.7,164 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.8,388 కోట్లకు పెరిగింది.  రూ.2,100 కోట్ల కంటింజెన్సీ రిజర్వ్‌లను కూడా కలుపుకుంటే గత క్యూ4లో  కేటాయింపులు పదిరెట్లు  పెరిగాయి.  అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.399 కోట్లుగా ఉన్న కేటాయింపులు గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.3,661 కోట్లకు ఎగబాకాయి. వివిధ రంగాల్లో ఒత్తిడి రుణాలు రూ.10,000 కోట్ల మేర ఉంటాయని, వీటి కోసం భారీగా కేటాయింపులు జరిపాల్సి వచ్చిందని తెలిపింది.  భారీ నష్టాలు ఉన్నప్పటికీ, ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.2 డివిడెండ్‌ను బ్యాంక్‌ ఇవ్వనున్నది.  

క్షీణించిన రుణ నాణ్యత.... 
బ్యాంక్‌ రుణ నాణ్యత బాగా క్షీణించింది. స్థూల మొండి బకాయిలు 1.28 శాతం నుంచి దాదాపు రెట్టింపై 3.22 శాతానికి ఎగిశాయి. నికర మొండి బకాయిలు 0.64 శాతం నుంచి 1.86 శాతానికి పెరిగాయి. తాజా మొండి బకాయిలు రూ.3.481 కోట్లుగా ఉన్నాయి. వీటిల్లో జెట్‌ ఎయిర్‌వేస్‌ బకాయిలు రూ.552 కోట్లు, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ బకాయిలు రూ.529 కోట్లు.  గత క్యూ4లో భారీగా నికర నష్టాలు రావడం పూర్తి ఆర్థిక సంవత్సరం బ్యాంక్‌ నికర లాభంపై తీవ్రంగా ప్రభావం చూపించింది. 2017–18లో రూ.4,224 కోట్ల నికర లాభం రాగా గత ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.1,720 కోట్లకే పరిమితమైంది. ఈ ఏడాది మార్చినాటికి క్యాపిటల్‌ అడెక్వసీ రేషియో 16.5 శాతంగా ఉంది.   నికర వడ్డీ ఆదాయం రూ.5,742 కోట్ల నుంచి రూ.7,857 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది మార్చి నాటికి ముగిసిన సంవత్సరానికి రుణాలు 19 శాతం వృద్ధితో రూ.2,41,500 కోట్లకు, డిపాజిట్లు 13 శాతం వృద్ధితో రూ.2,27,610 కోట్లకు పెరిగాయి. ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 50 శాతం నుంచి 43 శాతానికి తగ్గింది.  

వంద కోట్ల డాలర్ల నిధుల సమీకరణ... 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17–18 శాతం రేంజ్‌లో రుణ వృద్ధి సాధించడంపైన దృష్టి కేంద్రీకరిస్తున్నామని సీఈఓ రవ్‌నీత్‌ గిల్‌ చెప్పారు. దీనిని క్రమంగా 22–24 శాతానికి పెంచుతామని, గతంలో సాధించిన 40 శాతం రుణ వృద్ధి కోసం పరుగులు పెట్టబోమని పేర్కొన్నారు. మేనేజ్‌మెంట్‌ స్థాయిల్లో భారీ మార్పులు ఉండవని, బ్యాంక్‌లో గవర్నెన్స్‌ సమర్థంగా ఉండాలని భావిస్తున్నామని, ఈ దిశగా కొన్ని నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. రుణ మార్గంలో రూ.20,000 కోట్లు, ఈక్విటీల జారీ ద్వారా వంద కోట్ల డాలర్ల నిధులు సమీకరించడానికి బోర్డ్‌ ఆమోదం తెలిపింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top