ఆర్‌బీఐ సమీక్ష, గణాంకాలే కీలకం..! 

What to expect from RBI monetary policy meet on April 4 - Sakshi

ద్వైమాసిక పరపతి సమీక్షపై మార్కెట్‌ దృష్టి

సోమవారం ఆటో పరిశ్రమ అమ్మకాల డేటా

నికాయ్‌ పీఎంఐ డేటా ఈవారంలోనే..

శుక్రవారం యూఎస్‌ నాన్‌ ఫామ్‌ పేరోల్స్‌ గణాంకాలు  

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి ద్వైమాసిక పరపతి సమీక్షను ఆర్‌బీఐ ఈ వారంలోనే నిర్వహించనుంది. శక్తికాంతదాస్‌అధ్యక్షతన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈనెల 2 నుంచి 4 వరకూ(గురువారం)  మూడు రోజులపాటు ఈ సమీక్షను నిర్వహించనుంది. పావు శాతం రేట్ల కోత ప్రకటన ఉండవచ్చని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. వడ్డీ రేట్లు దిగివస్తే ప్రధాన సూచీలకు ఇది సానుకూల అంశంగా మారుతుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ హెడ్‌ (పీసీజీ, కాపిటల్‌ మార్కెట్స్‌ స్ట్రాటెజీ విభాగం) వీకే శర్మ అన్నారు. అయితే, ముందుగానే అంచనా వేసిన తగ్గుదల కారణంగా ఆర్‌బీఐ ప్రకటన అనంతరం మార్కెట్‌లో లాభాల స్వీకరణకు అవకాశం లేకపోలేదని అంచనాలు వెలువడతున్నాయి. ఇక ఈ ప్రధాన అంశానికి తోడు స్థూల ఆర్థిక అంశాలు, అంతర్జాతీయ పరిణామాలు, సాధారణ ఎన్నికల ప్రభావం ఈవారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నట్లు చెబుతున్నారు. 

‘వరుస ఈవెంట్స్‌ ఉన్నందున ఆయా రంగాల షేర్లలో కదలికలు భారీగానే ఉండనున్నాయి.’ అని క్యాపిటల్‌ఎయిమ్‌ పరిశోధనా విభాగం హెడ్‌ దేబబ్రత భట్టాచార్య విశ్లేషించారు. ‘విదేశీ ఇన్వెస్టర్ల వరుస కొనుగోళ్లు, ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందనే అంచనాలు, రాజకీయ స్థిరత్వం వంటి సానుకూల అంశాల నేపథ్యంలో అభివృద్ది చెందుతున్న మార్కెట్లతో పోల్చితే దేశీ మార్కెట్‌ అవుట్‌పెర్ఫార్మ్‌ చేసేందుకు అవకాశం ఉంది’ అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధనా విభాగం చీఫ్‌ వినోద్‌ నాయర్‌ విశ్లేషించారు. 

స్థూల ఆర్థికాంశాలపై మార్కెట్‌ దృష్టి.. 
గతనెలకు సంబంధించిన నికాయ్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) మంగళవారం (ఏప్రిల్‌ 2న) విడుదలకానుండగా.. నికాయ్‌ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ గురువారం వెల్లడికానుంది. మరోవైపు మార్చి ఆటో రంగ పరిశ్రమ అమ్మకాల గణంకాలు సోమవారం (ఏప్రిల్‌ 1న) సియామ్‌ ప్రకటించనుంది. 

అమెరికా ఉద్యోగ గణాంకాలు వెల్లడి.. 
యూఎస్‌ నాన్‌ ఫామ్‌ పేరోల్స్‌(వ్యవసాయేతర ఉద్యోగాలు) గణాంకాలు శుక్రవారం వెల్లడికానుండగా.. ఆదేశ ఫిబ్రవరి రిటైల్‌ అమ్మకాల డేటా, ఐఎస్‌ఎం మ్యానుఫ్యాక్చరింగ్‌ పీఎంఐ సోమవారం విడుదలకానున్నాయి. యూఎస్‌ నాన్‌–మ్యానుఫ్యాక్చరింగ్‌ పీఎంఐ బుధవారం రానుంది. ఇక అంతర్జాతీయ ప్రధాన ఆర్థిక అంశాల్లో.. చైనా మార్చినెల తయారీ గణాంకాలు సోమవారం విడుదలకానున్నాయి. వీటితోపాటు అమెరికా–చైనా వాణిజ్య యుద్ధ అంశం, బ్రెగ్జిట్‌ పరిణామాలపై మార్కెట్‌ వర్గాలు దృష్టిసారించాయి.  

70 డాలర్ల దిగువనే క్రూడ్‌.. 
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ శుక్రవారం ఒక్కసారిగా ఒక శాతం పెరిగింది. చివరకు 67.60 డాలర్ల వద్ద ముగిసింది. ఉత్పత్తి తగ్గిన కారణంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ.. బ్యారెల్‌ ధర 70 డాలర్ల దిగువ ఉన్నంతకాలం మార్కెట్లపై ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సీనియర్‌ ఫండ్‌ మేనేజర్‌ శ్రీయాష్‌ దేవాల్కర్‌ అన్నారు. గతవారంలో పెరిగిన క్రూడ్‌ ధరల కారణంగా డాలరుతో రూపాయి మారకం విలువ స్వల్పంగా క్షీణించినప్పటికీ.. ఆర్‌బీఐ సమీక్ష నేపథ్యంలో సోమవారం ప్రస్తుత స్థాయిల వద్దనే కొనసాగవచ్చని, సమీక్ష అనంతరం పూర్తి సంకేతాలు అందనున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ విశ్లేషకులు అమిత్‌ గుప్తా అన్నారు.

చివరి రెండు నెలల్లో విదేశీ నిధుల వెల్లువ
గత ఆర్థిక సంవత్సరం చివరి రెండు నెలల్లో విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం జోరుగా కొనసాగింది. ఒక్క మార్చిలోనే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ)లు ఈక్విటీ మార్కెట్లో రూ.33,980 కోట్లు, డెట్‌ మార్కెట్లో రూ.12,001 కోట్లు పెట్టుబడిపెట్టి.. నికరంగా గత నెలలో రూ.45,981 కోట్లను ఇన్వెస్ట్‌ చేసినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. ఫిబ్రవరిలో మొత్తంగా రూ.11,182 కోట్లను పెట్టుబడిపెట్టినట్లు తేలింది. అయితే, పూర్తి ఆర్థిక సంవత్సరం(2018–19)లో రూ. 44,500 కోట్లను ఉపసంహరించుకున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top