మీ ‘పన్ను’ దారేది?

variation OF Current Tax Policy And New Tax Policy - Sakshi

ఎవరికి ఏ పన్ను విధానం ప్రయోజనం...

రూ.10 లక్షల ఆదాయంపై ప్రస్తుత విధానమే లాభం

మినహాయింపులను పూర్తిగా వినియోగించుకోవాలి

దాంతో పన్ను బాధ్యత లేకుండా చూసుకోవచ్చు

సెక్షన్‌ 80సీ ఇన్వెస్ట్‌ చేయని వారికి పన్ను ఆదా ప్రయోజనాలు క్లెయిమ్‌ చేసుకోని వారికి నూతన పన్నువిధానం ప్రయోజనకరం

ఎవరికి ఏదన్నది వారి ఆర్థిక ప్రణాళిక ప్రకారమే నిర్ణయం

ఆదాయపన్ను రేట్లు తగ్గుతాయని ఆశగా ఎదురు చూసిన వారిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నూతన పన్ను రేట్లతో అయోమయంలో పడేశారు. ప్రస్తుత పన్ను విధానం లేదా నూతన పన్ను విధానంలో తమకు అనుకూలమైన విధానంలోనే రిటర్నులు దాఖలు చేసుకోవచ్చని ప్రకటించారు. రూ.15 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ఆదాయపన్నును కొంత మేరకు తగ్గిస్తూ నూతన పన్ను రేట్లను మంత్రి ప్రతిపాదించారు. అంటే ప్రస్తుతమున్న విధానంలోనే కొనసాగడం లేదా నూతన విధానానికి మారడం పన్ను చెల్లింపుదారుల అభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది. మరి నూతన పన్ను విధానానికి మారిపోవాలా..? లేక ఇప్పుడున్న విధానంలోనే కొనసాగాలా..? అని ప్రశ్నిస్తే.. అది ఒక్కో వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. తమ ఆదాయాన్ని బట్టి దీనిపై నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. పాత, కొత్త విధానంలో పన్ను భారంపై అవగాహన కల్పించే ప్రాఫిట్‌ కథనం ఇది.

రూ.15 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తి నూతన పన్ను విధానంలో రూ.78,000ను ఆదా చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి బడ్జెట్‌ సందర్భంగా ప్రకటించారు. ఇది నిజమే. కానీ, ఎవరికి ఈ ప్రయోజనం నిజంగా అంటే.. ఎటువంటి మినహాయింపులను క్లెయిమ్‌ చేసుకోని వారికే నూతన పన్ను విధానంతో ప్రయోజనమని క్లుప్తంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆదాయపన్ను విధానంలో ఎన్నో మినహాయింపులు(ఎగ్జంప్షన్‌), తగ్గింపులు(డిడక్షన్‌) ఉన్నాయి. అయితే, కొందరు కొన్ని రకాల మినహాయింపులనే వినియోగించుకుంటుంటే, కొందరు అయితే అస్సలు ఏ ప్రయోజనాన్ని కూడా వాడుకోకుండా రిటర్నులు ఫైల్‌ చేస్తున్నారు. ఇలా ఏ డిడక్షన్, ఎగ్జంప్షన్‌ వినియోగించుకోని వారికి నూతన పన్ను రేట్లు ప్రయోజనకరం.

అలాగే, తీసివేతలు, మినహాయింపుల గందరగోళాన్ని అర్థం చేసుకోలేని వారు నూతన విధానానికి మారిపోవచ్చు. లేదు, చట్ట పరిధిలో అన్ని మినహాయింపులు, తగ్గింపులను ఉపయోగించుకుంటానంటే ప్రస్తుత విధానంలోనే ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. ‘‘ఇదొక మంచి నిర్ణయం. తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఇచ్చినట్టయింది’’ అని ట్యాక్స్‌స్పానర్‌ సహ వ్యవస్థాపకుడు సుధీర్‌ కౌశిక్‌ పేర్కొన్నారు. ‘‘హౌస్‌ రెంట్‌ అలవెన్స్, సెక్షన్‌ 80సీ కింద మినహాయింపులు పొందుతున్న వారికి నూతన పన్ను విధానానికి మారిపోవడం ప్రయోజనకరం కాదు’’ అని అశోక్‌ మహేశ్వరి అండ్‌ అసోసియేట్స్‌ ట్యాక్స్‌ లీడర్‌ అమిత్‌ మహేశ్వరి తెలిపారు.

చాప్టర్‌ 6ఏ పరిధిలోని సెక్షన్‌ 80సీ, సెక్షన్‌ 80డీ, సెక్షన్‌ 80సీసీడీ మినహాయింపులు రూ.2,50,000ను పూర్తిగా వినియోగించుకున్నట్టు అయితే రూ.7,50,000 వరకు ఆదాయం ఉన్న వారూ ప్రస్తుత విధానంలో  పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే, రుణంపై ఇంటిని కొనుగోలు చేసిన వారు చాప్టర్‌ 6ఏకు అదనంగా సెక్షన్‌ 24 కింద ఇంటి రుణానికి చేసే వడ్డీ చెల్లింపులు రూ.2,00,000పై, స్టాండర్డ్‌ డిడక్షన్‌ 50,000ను కూడా వినియోగించుకుంటే అప్పుడు మొత్తం రూ.10,00,000 ఆదాయం ఉన్నప్పటికీ చెల్లించాల్సిన పన్ను బాధ్యత సున్నాయే అవుతుంది. ఇక సెక్షన్‌ 80టీటీఏ కింద డిపాజిట్లపై వడ్డీ రూ.10,000 వరకు మినహాయింపు కూడా ఉంది. నూతన పన్ను విధానానికి మారితే జీవిత బీమా, వైద్య బీమా ప్రీమియం, ఇంటి రుణానికి చేసే వడ్డీ చెల్లింపులతోపాటు ఎల్‌టీఏ తరహా మినహాయింపులను కోల్పోవాల్సి వస్తుంది.

నూతన విధానంలోనూ ఎన్‌పీఎస్‌(రిటైర్మెంట్‌ సాధనం) పై పన్ను ఆదా చేసుకునే ఒక అవకాశాన్ని కొనసాగించారు. అది వ్యక్తిగతంగా ఎన్‌పీఎస్‌లో చేసే పెట్టుబడులు కాకుండా.. ఉద్యోగుల తరఫున కంపెనీలు ఎన్‌పీఎస్‌కు జమ చేసే చందాలకు సెక్షన్‌ 80సీసీడీ (2) కింద పన్ను ఆదా ప్రయోజనం వర్తిస్తుంది. మూలవేతనం, కరువు భత్యం (డీఏ)పై వార్షికంగా 10% ఎన్‌పీఎస్‌ చందాలపై పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకు వార్షిక మూలవేతనం, కరువు భత్యం రూ.5 లక్షలు ఉందనుకుంటే ఇందులో 10% రూ.50,000పై పన్ను చెల్లించక్కర్లేదు. ఎన్‌పీఎస్‌ అయినా లేదా ఈపీఎఫ్‌ అయినా ఉద్యోగ సంస్థ చేసే చందా లకు ఇదే వర్తిస్తుంది. ఒకవేళ ఒక ఉద్యోగి తరఫున సంస్థ వార్షికంగా రూ.7.5 లక్షలకు మించి జమ చేస్తే అప్పుడు పన్ను    పడుతుంది.

ఒక్కసారి మారిపోతే..?
ప్రస్తుత విధానంలో కొనసాగొచ్చు లేదా నూతన విధానానికి మారిపోవచ్చన్న వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే, ఈ రెండింటిలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఏటేటా ఉంటుందా..? లేక ఒక్కసారి నూతన విధానానికి మారిపోతే అందులోనే మరుసటి ఏడాది నుంచి రిటర్నులు దాఖలు చేయాలా..? అన్న సందేహం రావచ్చు. ఏ విధానంలో రిటర్నులు దాఖలు చేయవచ్చన్నది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

‘‘వ్యక్తులు లేదా హిందూ అవిభాజ్య కుటుంబం ఎటువంటి వ్యాపార ఆదాయం లేకపోతే, గడిచిన ప్రతీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయంపై రిటర్నులు ఏ విధానంలో దాఖలు చేయాలన్నది ఎంచుకునే ఆప్షన్‌ ఉంటుంది. ఇతర కేసుల్లో అయితే, ఒక్కసారి నూతన విధానానికి మారిపోతే ఆ తర్వాత నుంచి అదే విధానంలో కొనసాగాల్సి ఉంటుంది’’ అని బడ్జెట్‌ మెమొరాండం స్పష్టం చేస్తోంది.  

‘‘ప్రతీ ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు ఏ పన్ను విధానాన్ని అయినా ఎంచుకోవచ్చు. పన్ను మినహాయింపులు, తగ్గింపులతో రిటర్నులు దాఖలు చేయవచ్చు లేదా నూతన విధానంలో తక్కువ పన్ను రేట్ల ప్రకారం రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని షరతులు ఉన్నాయి. ఎటువంటి వ్యాపార ఆదాయం లేని వారు నూతన పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. ఒకవేళ వ్యాపార ఆదాయం ఉన్న వారు మినహాయింపులు, తగ్గింపులను వినియోగించుకుని ప్రస్తుత విధానంలో పన్ను రిటర్నులు దాఖలు చేసినట్టయితే అప్పుడు పాత విధానంలోనే కొనసాగినట్టవుతుంది. తర్వాతి సంవత్సరాల్లోనూ నూతన విధానానికి మారే అవకాశం ఉండదు’’ అని ట్యాక్స్‌మన్‌ డాట్‌ కామ్‌ డీజీఎం వాధ్వా తెలిపారు.

వ్యాపార ఆదాయం లేని పన్ను చెల్లింపుదారుడు ప్రస్తుత విధానం లేక నూతన ప్రతిపాదిత విధానాన్ని ఎంచుకోవచ్చు. అయితే, వ్యాపార ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారునికి ఈ రెండింటిలో ఎందులో కొనసాగాలన్న ఆప్షన్‌ ఒక్కసారి మాత్రమే ఉంటుంది.

ఏ విధానంలో ఎంత భారం
రూ.7.5 లక్షల ఆదాయం ఉన్న వారు
► స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50,000, సెక్షన్‌ 80సీ సాధనాల్లో రూ.1,50,000 పెట్టుబడులతోపాటు ఎన్‌పీఎస్‌లో అదనంగా రూ.50,000 ను ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మొత్తం రూ.2,50,000 ఆదాయంపై మినహాయింపులు పొందొచ్చు. ఎన్‌పీఎస్‌ లేకపోతే సెక్షన్‌ 80డీ కింద  తన కుటుంబానికి,  తల్లిదండ్రులకు చెల్లిస్తున్న వైద్య బీమా ప్రీమియంను మినహాయింపుగా చూపించుకున్నా సరిపోతుంది. మొత్తం ఆదాయం రూ.7,50,000 నుంచి మినహాయింపులు రూ.2.5 లక్షలను తీసివేయగా మిగిలిన పన్ను వర్తించే ఆదాయం రూ.5,00,000 అవుతుంది. పన్ను వర్తించే ఆదాయం మినహాయింపుల తర్వాత రూ.5లక్షలు దాటనందున సెక్షన్‌ 87ఏ కింద పన్ను చెల్లించకుండా రిబేటు పొందొచ్చు.

► కొత్త విధానంలో ఈ మినహాయింపులు లేవుకనుక.. మొదటి రూ.2,50,001 –5,00,000పై 5% కింద రూ.12,500, తర్వాతి రూ.2.5 లక్షలపై 10% పన్ను రేటు ప్రకారం రూ.25,000.. మొత్తం రూ.37,500 పన్ను చెల్లించాలి.  

► ఒకవేళ పాత విధానంలోనే కొనసాగుతూ కొన్ని మినహాయింపులనే క్లెయిమ్‌ చేసుకునేట్టు అయితే.. ఉదాహరణకు ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేయని వారు, సెక్షన్‌ 80సీ కింద రూ.150,000, స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50,000, సెక్షన్‌ 80డీ కింద వైద్య బీమా ప్రీమియంను మినహాయింపులుగా చూపించుకోవచ్చు. అలా రూ.2,00,000ను మినహాయింపుగా చూపించుకున్నారనుకుంటే.. మిగిలిన రూ.50,000పై ప్రస్తుత విధానంలో 20 శాతం పన్ను రేటు ప్రకారం రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రస్తుత విధానమే బెస్ట్‌.  

► ఒకవేళ సెక్షన్‌ 80సీ కింద కేవలం రూ.1,00,000 మాత్రమే వినియోగించుకుని, స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50,000ను కూడా క్లెయిమ్‌ చేసుకుంటే అప్పుడు పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ.1,00,000 అవుతుంది. దీనిపై 20% అంటే రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ ప్రయోజనమే.  

► సెక్షన్‌ 80సీ కింద రూ.50,000 వరకూ పెట్టుబడులు ఉంటే,  దీనికి స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50,000 కలుపుకోవచ్చు. వైద్య బీమా ప్రీమియం రూ.12,000 వరకు చెల్లిస్తున్న వారు చాలా మందే ఉంటారు. ఈ విధంగా చూస్తే కనీస మినహాయింపులు రూ.1,00,000–1,50,000 వరకు ఎక్కువ మందికి ఉంటుంటాయి. వీరికి ప్రస్తుత విధానమే లాభకరం.

రూ.10 లక్షల ఆదాయం విషయంలో...
► వీరు కూడా స్టాండర్డ్‌ డిడక్షన్, సెక్షన్‌ 80సీ, 80సీసీడీ కింద పూర్తిగా రూ.3,00,000ను వినియోగించుకుంటే అప్పుడు రూ.2,00,000 మొత్తంపై ప్రస్తుత విధానంలో 20 శాతం కింద రూ.40,000 పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ గృహ రుణం తీసుకుని వడ్డీ చెల్లిస్తుంటే ఆ విధంగా మరో రూ.2,00,000పైనా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. దీంతో నికరంగా చెల్లించాల్సిన పన్ను సున్నాయే అవుతుంది. ఇప్పటి వరకు ఇల్లు సమకూర్చుకోని వారు రుణంపై ఇంటిని తీసుకోవడం ద్వారా ఈ ఆదాయ వర్గాల వారు ఏటా రూ.40,000 వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు.  

► అదే నూతన విధానంలో రూ.2,50,001–5,00,000పై 5 శాతం కింద రూ.12,500, 5,00,001–7,50,000 ఆదాయంపై 10 శాతం ప్రకారం రూ.25,000వేలు, తర్వాత రూ.2,50,000పై 15 శాతం పన్ను రేటు ప్రకారం రూ.37,500 మొత్తం రూ.75,000 పన్ను చెల్లించాల్సి ఉంటుంది.  

► ప్రస్తుత విధానంలో కనీసం సెక్షన్‌ 80సీ, 80సీసీడీ, 80డీ, స్టాండర్డ్‌ డిడక్షన్‌లు వినియోగించుకున్నా నూతన విధానంతో పోలిస్తే తక్కువ పన్ను చెల్లిస్తే చాలు.

► ప్రస్తుత విధానంలో ఏ మినహాయింపులను క్లెయిమ్‌ చేసుకోని వారు, అదే సమయంలో సెక్షన్‌ 80సీలో కేవలం రూ.లక్ష వరకు ఇన్వెస్ట్‌ చేస్తున్నట్టయితే అప్పుడు వీరు రూ.4,00,000పై ప్రస్తుత విధానంలోనే 20 శాతం పన్ను రేటుపై రూ.80,000 చెల్లించాల్సి వస్తుంది. కనుక వీరికి కొత్త విధానం బెటర్‌.

► ఒకవేళ ఇంటి రుణం లేని వారికి హెచ్‌ఆర్‌ఏ మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. కనుక దాన్ని పరిగణనలోకి తీసుకుని చూడాలి. హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్‌కు మూడు విధానాలున్నాయి. వేతనంలో భాగంగా ఉద్యోగి పొందుతున్న వాస్తవ హెచ్‌ఆర్‌ఏ మొత్తం.. లేదా మెట్రోల్లో నివసించే వారి మూల వేతనంలో 50%, అదే నాన్‌ మెట్రో ప్రాంతాల్లోని వారి మూల వేతనంలో 40%.. లేదా మీరు వార్షికంగా చెల్లించిన అద్దె నుంచి మీ వార్షిక వేతనంలో 10 శాతాన్ని తీసివేయగా మిగిలిన మొత్తం. ఈ మూడింటింలో ఏది తక్కువ అయితే ఆ మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు.

► 10 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారు తమ పెట్టుబడులను అన్నింటినీ లిస్ట్‌ చేసుకుని, మినహాయింపులను పరిగణనలోకి తీసుకుని అప్పుడు ఏ విధానంలో రిటర్నులు దాఖలు చేయాలన్నది నిర్ణయించుకోవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top