
సమావేశంలో మాట్లాడుతున్న గవర్నర్ తమిళిసై
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జనాభా పెరుగుదల, వలసలు, నియంత్రణ లేని అభివృద్ధి వంటి కారణాల వల్ల సహజ వనరులు దోపిడీకి గురువుతున్నాయని, ఇవే వాతావరణ మార్పులకు ప్రధాన కారణాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సుందరరాజన్ అన్నారు. ప్రభుత్వం నుంచి బలవంతంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు కాకుండా స్వచ్ఛందంగా బాధ్యతాయుతమైన పౌరుడిగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని గుర్తు చేశారు. గురువారమిక్కడ 17వ సీఐఐ–ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్–2019 ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. రోజువారీ కార్యకలాపాలతో సహజ వనరులను సంరక్షించుకోవచ్చని సూచించారు. అనంతరం సీఐఐ గోద్రెజ్ జీబీసీ చైర్మన్ జంషేడ్ ఎన్ గోద్రెజ్ మాట్లాడుతూ.. మౌలిక, భవన నిర్మాణ రంగాల్లో నీటి సంరక్షణ, వాటర్ రీసైక్లింగ్‌లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అన్ని రకాల పరిశ్రమల్లో జీరో కార్బన్ ఉద్ఘారాల స్థితికి చేరుకోవాలన్నారు. మూడు రోజుల గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్–2019లో సుమారు వందకు పైగా కంపెనీలు గ్రీన్ బిల్డింగ్ ఉత్పత్తులు, టెక్నాలజీలను ప్రదర్శించాయి. ఈ కార్యక్రమంలో ఐజీబీసీ చైర్మన్ వీ సురేష్, సీఐఐ–ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ సి. శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.