
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో మరింత పోటీ అవసరమని సెబీ చైర్మన్ అజయ్ త్యాగి చెప్పారు. ఫండ్స్ టోటల్ ఎక్స్‌పెన్స్ రేషియోలో (టీఈఆర్/ మొత్తం వ్యయ నిష్పత్తి) మరింత హేతుబద్ధీకరణ అవసరమని, తాము దీనిపైనే దృష్టి పెట్టామని చెప్పారు. యాంఫి వార్షిక సదస్సు సందర్భంగా విలేకరులతో అజయ్‌త్యాగి మాట్లాడుతూ... అగ్ర స్థాయి ఏడు ఫండ్స్ సంస్థలు 60–70 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ మొత్తం లాభంలో 60 శాతం ఈ ఏడు సంస్థల చేతుల్లోనే ఉందన్నారు. ‘‘పరిశ్రమలో మరింత పోటీ అవసరం. టీఈఆర్ హేతుబద్ధీకరణ జరగాలి. దీన్నే మేం పరిశీలిస్తున్నాం’’ అని చెప్పారాయన. టీఈఆర్ అన్నది ఓ పథకం నిర్వహణలోని నిధుల మొత్తం నుంచి మినహాయించుకునే వ్యయాల శాతం. పరిపాలన, నిర్వహణ తదితర చార్జీలన్నీ కలిపి టీఈఆర్ రూపంలో వసూలు చేస్తుంటాయి. ‘‘టీఈఆర్ విధానం 1990ల చివర్లో మొదలైంది. అప్పట్లో ఫండ్స్ నిర్వహణ ఆస్తులు రూ.50,000 కోట్లుగా ఉంటే, అవి నేడు రూ.23 లక్షల కోట్ల స్థాయికి చేరాయి. కనుక కొన్ని చర్యలు అవసరం. హేతుబద్ధీకరణను పరిశీలిస్తున్నాం’’ అని త్యాగి తెలిపారు. దేశ జీడీపీలో 11 శాతం మేరకే మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు ఉన్నాయన్న ఆయన, వృద్ధికి అపార అవకాశాలున్నాయని గుర్తు చేశారు.
క్లోజ్ ఎండెడ్ పథకాలపై త్వరలో విధానం..
పొదుపు పుంజుకుందని, డీమోనిటైజేషన్ తర్వాత బ్యాంకుల్లోకి నగదు రాక పెరిగిందని అజయ్‌త్యాగి పేర్కొన్నారు. పెట్టుబడులన్నీ కేవలం కొన్ని స్టాక్స్‌లోకే వెళుతున్నాయన్న త్యాగి... పెట్టుబడులకు మంచి స్టాక్స్ ఎంపిక అనేది మ్యూచువల్ ఫండ్స్ ముందున్న సవాల్ అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. క్లోజ్ ఎండెడ్ పథకాలపై త్వరలోనే ఓ విధానాన్ని తీసుకొస్తామని ఆయన తెలిపారు. డెట్ ఫండ్ మేనేజర్లు పెట్టుబడుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కువ శాతం నిధులు ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి వస్తున్నాగానీ, విశ్వసనీయత కలిగిన డెట్ సాధనాల్లోనే ఆ డబ్బులను పెట్టుబడి పెట్టాల్సి ఉందని, క్రెడిట్ రిస్క్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. డెట్ ఫండ్స్ నిర్వహణలో రూ.12.3 లక్షల కోట్ల ఆస్తులు ఉంటే, అందులో రూ.11.5 లక్షల కోట్లు నాన్ రిటైల్ ఇన్వెస్టర్లవేనని త్యాగి తెలియజేశారు. కమోడిటీ మార్కెట్లోకి మ్యూచువల్ ఫండ్స్‌ను అనుమతించే అంశంపై మాట్లాడుతూ... కమోడిటీ మార్కెట్లు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు లిక్విడిటీని అందించలేవన్నారు. కమోడిటీ మార్కెట్లో ఫిజికల్ డెలివరీ అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.