రాయల్టీలపై మళ్లీ పరిమితులు! | Restrictions on royalties! | Sakshi
Sakshi News home page

రాయల్టీలపై మళ్లీ పరిమితులు!

Apr 21 2017 12:39 AM | Updated on Sep 5 2017 9:16 AM

రాయల్టీలపై మళ్లీ పరిమితులు!

రాయల్టీలపై మళ్లీ పరిమితులు!

దేశీ ఐటీ కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపేలా అమెరికా ప్రభుత్వం హెచ్‌1బీ వీసాలపై ఆంక్షలు విధించడం మీద భారత్‌ ఘాటుగా స్పందించింది.

అమెరికన్‌ సంస్థలకు భారత్‌ ఝలక్‌
► పరోక్ష హెచ్చరికలు
► హెచ్‌1బీ వీసాలపై ఆంక్షలకు ప్రతిచర్య

న్యూఢిల్లీ: దేశీ ఐటీ కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపేలా అమెరికా ప్రభుత్వం హెచ్‌1బీ వీసాలపై ఆంక్షలు విధించడం మీద భారత్‌ ఘాటుగా స్పందించింది. భారత్‌లోని అమెరికన్‌ కంపెనీలు కూడా ఇలాంటి చర్యల పర్యవసానాలు ఎదుర్కొనాల్సి వస్తుందని, వాటికి వచ్చే రాయల్టీలపై పరిమితులు విధించే అవకాశాలూ ఉన్నాయంటూ పరోక్షంగా హెచ్చరించింది. ‘భారత కంపెనీలు అమెరికాలో ఉండటమే కాదు.. అమెరికన్‌ కంపెనీలు కూడా భారత్‌లో ఉన్నాయి. అవి కూడా మంచి ఆదాయాలు.. లాభాలు ఆర్జిస్తున్నాయి. అవన్నీ కూడా అమెరికాకే వెడుతున్నాయి. అమెరికా చర్యలు.. కేవలం భారతీయ కంపెనీలకు మాత్రమే పరిమితం కాబోవు.

చాన్నాళ్లుగా భారత్‌లో కూడా పలు అమెరికన్‌ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఈ చర్చను మరింతగా పొడిగిస్తే.. ఇలాంటి అంశాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది‘ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ వ్యాఖ్యానించారు. ప్రపంచ వాణిజ్య సంస్థకు ఇచ్చిన హామీ ప్రకారం అమెరికా నిర్దిష్ట స్థాయిలో వీసాలు కల్పించాల్సి ఉంటుందని, ఒకవేళ అలా చేయడంలో అమెరికా విఫలమైతే భారత్‌ ప్రశ్నించవచ్చని ఆమె పేర్కొన్నారు.

అయితే, ఇప్పటికీ తాము నిర్మాణాత్మకమైన చర్చలు మాత్రమే కోరుకుంటున్నామని మంత్రి తెలిపారు.  2009కి ముందు దాకా భారత్‌లోని విదేశీ కంపెనీలు తమ మాతృ సంస్థలకు విదేశీ టెక్నాలజీ బదలాయింపుతో జరిగిన దేశీ అమ్మకాల్లో 5 శాతం, ఎగుమతులపై 8 శాతం మేర  రాయల్టీ  రూపంలో చెల్లింపులు జరిపే వెసులుబాటు ఉండేది. టెక్నాలజీ బదలాయింపు లేని వాటి విషయంలో రాయల్టీ దేశీ అమ్మకాల్లో 1%, ఎగుమతులపై 2 శాతం ఉండేది. 2009 డిసెంబర్‌ నుంచి ఈ పరిమితులను ఎత్తివేశారు.

అయితే, ఇటీవలి కాలంలో రాయల్టీల రూపంలో భారీ ఎత్తున నిధులు తరలిపోతుండటాన్ని పరిశీలించేందుకు కేంద్రం అంతర్‌–మంత్రిత్వ శాఖల బృందాన్ని ఏర్పాటు చేసింది. అటు అమెరికా వీసాలపై ఆంక్షలు విధించిన దరిమిలా చోటు చేసుకున్న ఈ పరిణామం నేపథ్యంలో నిర్మల సీతారామన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

సంపన్న దేశాలు రక్షణాత్మక గోడలు కట్టేస్తున్నాయ్‌..: వీసా నిబంధనలు కఠినతరం చేస్తూ.. సంపన్న దేశాలు రక్షణాత్మక ధోరణి పాటిస్తుండటంపై కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వైఖరులతో సమస్యలు తలెత్తకుండా సర్వీసుల వాణిజ్యానికి సంబంధించి ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) .. అంతర్జాతీయ స్థాయిలో తగు విధానాలను రూపొందించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement