ద్రవ్య లభ్యతపై ఆర్‌బీఐ ప్రత్యేక దృష్టి!

RBI special focus on monetary availability - Sakshi

ఫైనాన్షియల్‌ సంస్థల లిక్విడిటీ పర్యవేక్షణ

దీనికోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు

చెన్నై: బ్యాంకులు, నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) సహా ఫైనాన్షియల్‌ సంస్థలకు ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్యలు తలెత్తకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి, సమీక్షించడానికి, తగిన సూచనలు చేయడానికి ఆర్‌బీఐలోనే అంతర్గతంగా ప్రత్యేక విభాగాన్ని (కేడర్‌) ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం నేపథ్యంలో నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు తీవ్ర నగదు లభ్యత సమస్యను ఎదుర్కొంటున్న నేపథ్యంలో గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలో జరిగిన ఆర్‌బీఐ 576వ సెంట్రల్‌బోర్డ్‌ సమవేశంలో తాజా నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు తీవ్ర ద్రవ్య లభ్యత సమస్యలను ఎదుర్కొంటున్నట్లు గత నెల్లో కార్పొరేట్‌ వ్యవహారాల కార్యదర్శి ఐ. శ్రీనివాస్‌ వ్యాఖ్యానించడమూ ఈ నిర్ణయానికి నేపథ్యం.  

ఆర్థిక పరిస్థితిపై చర్చ.. 
ప్రస్తుతం దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితి, సవాళ్లతోపాటు వివిధ అంశాలకు సంబంధించి ఆర్‌బీఐ కార్యకలాపాలపైనా బోర్డ్‌ సమావేశంలో చర్చ జరిగింది. నగదు నిర్వహణ, ప్రభుత్వంతో ఆర్‌బీఐ మధ్య సంబంధాలు వంటి అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చాయి. డిప్యూటీ గవర్నర్లు ఎన్‌ఎస్‌ విశ్వనాథన్, విరాల్‌ వీ ఆచార్య, బీపీ కనూంగూ, మహేశ్‌ కుమార్‌ జైన్‌లతో పాటు ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డ్‌ డైరెక్టర్లు భరత్‌ జోషి, సుధీర్‌ మాన్‌కంద్, మనీష్‌ సబర్వాల్, సతీష్‌ మరాథే, స్వామినాథన్‌ గురుమూర్తి, రేవతీ అయ్యర్, సచిన్‌ చతుర్వేదిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రం తరఫున డైరెక్టర్లు, ఫైనాన్స్‌ సెక్రటరీ సుభాష్‌ చంద్ర గార్గ్, ఫైనాన్షియల్‌ సేవల విభాగం కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌లు కూడా సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top