ఎయిరిండియాను కొనేవారే లేరు!! 

No Takers For Air India Stake Sale - Sakshi

గడువు పొడిగించినా ముందుకు రాని కంపెనీలు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన దిగ్గజం ఎయిరిండియాలో వాటాలను విక్రయించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించలేదు. బిడ్డింగ్‌కు ఆఖరు రోజైన మే 31 నాటికి కూడా వాటాల కొనుగోలుకు ఏ సంస్థా ముందుకు రాలేదని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి తదుపరి కార్యాచరణ ప్రణాళికను త్వరలో నిర్ణయించనున్నట్లు మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో పేర్కొంది. భారీ రుణాలు, నష్టాలు పేరుకుపోయిన ఎయిరిండియాలో వ్యూహాత్మకంగా 76 శాతం వాటాలను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఎయిరిండియాతో పాటు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఎయిరిండియా ఎస్‌ఏటీఎస్‌ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ను కూడా విక్రయానికి ఉంచింది. ఇందుకోసం ఆసక్తి వ్యక్తీకరణ పత్రాల (ఈవోఐ) దాఖలుకు ముందుగా మే 14 ఆఖరు తేదీగా నిర్ణయించినా.. మళ్లీ మే 31 దాకా పొడిగించారు. అర్హత పొందిన బిడ్డర్ల పేర్లను జూన్‌ 15న ప్రకటించాలని నిర్ణయించారు. ముందుగా ఇండిగో వంటి సంస్థలు కొంత ఆసక్తి చూపినప్పటికీ.. చివరికి ఏ సంస్థా కూడా బిడ్డింగ్‌లో పాల్గొనకపోవడం గమనార్హం. గతేడాది మార్చి ఆఖరు నాటికి ఎయిరిండియా మొత్తం రుణభారం రూ. 48,000 కోట్లుగా ఉంది.   

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top