మెప్పించని మారుతీ

Maruti Suzuki India Posts 27 percent Rise In Q1 Profit, Misses Analysts - Sakshi

జూన్‌ క్వార్టర్‌లో లాభం 

రూ.1,975 కోట్లు; 27 శాతం వృద్ధి 

4 శాతం పతనమైన షేర్‌  

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,975 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది  ఇదే క్వార్ట ర్‌లో సాధించిన లాభం రూ.1,556 కోట్లతో పోలిస్తే 27 శాతం వృద్ధి సాధించామని మారుతీ సుజుకీ తెలియజేసింది. గత క్యూ1లో రూ.19,374 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు ఈ క్యూ1లో రూ.21,811 కోట్లకు పెరిగాయని మారుతీ సుజుకీ ఇండియా చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ అజయ్‌ సేథ్‌ చెప్పారు. గత ఏడాది జూలై నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చినందున ఈ అమ్మకాల గణాంకాలను పోల్చడానికి లేదన్నారు. మొత్తం ఆదాయం రూ.19,777 కోట్ల నుంచి 14% వృద్ధితో రూ.22,459 కోట్లకు పెరిగిందని చెప్పారు. గత క్యూ1లో  3,94,571 వాహనాలు అమ్ముడవగా, ఈ క్యూ1లో 4,90,479 వాహనాలు విక్రయమయ్యాయని, 24% వృద్ధి సాధించామని తెలియజేశారు. దేశీ అమ్మకాలు 26%, ఎగుమతులు 2% చొప్పున పెరిగాయని, పరిశ్రమ వృద్ధి 20%గా ఉందని వివరించారు. కాగా, కంపెనీ రూ.2,273కోట్ల నికర లాభం, రూ.22,471 కోట్ల మొత్తం ఆదాయం సాధించగలదని విశ్లేషకులు అంచనా వేశారు. 

సరైన సమయంలో రేట్ల పెంపు నిర్ణయం... 
ఈ ఏడాది జనవరి నుంచి కమోడిటీల ధరలు ముఖ్యంగా ఉక్కు ధరలు బాగా పెరిగాయని, ఆ ప్రభావం క్యూ1 ఫలితాలపై పడిందని అజయ్‌ తెలియజేశారు. అయితే కమోడిటీల ధరలు పెరిగాయనే ఒక్క కారణంతో ధరలను పెంచబోమని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. క ంపెనీ క్యూ1 ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించలేకపోవడంతో మారుతీ షేర్‌ 4 శాతం మేర పతనమైంది. బీఎస్‌ఈలో ఈ షేర్‌ 3.7 శాతం క్షీణించి రూ.9,397 వద్ద ముగిసింది. మార్కెట్‌ క్యాప్‌రూ.10,906 కోట్లు తగ్గి రూ.2,83,854 కోట్లకు చేరింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top