చమురు ధరల పతనం భారత్‌కు వరం

Kotak And BOA estimates Crude Oil Price Down - Sakshi

క్యాడ్, ద్రవ్యోల్బణం దిగొస్తాయి

జీడీపీ పెరుగుతుంది

కోటక్, బీఓఏ అంచనాలు

న్యూఢిల్లీ: చమురు ధరల పతనం భారత ఆర్థిక వ్యవస్థకు ఎన్నో విధాలుగా కలిసొస్తుందని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్, బ్యాంకు ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ అభిప్రాయం వ్యక్తం చేశాయి. దేశ చమురు అవసరాల్లో 84 శాతం మేర దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో.. చమురు దిగుమతుల బిల్లు తగ్గడంతో కరెంటు ఖాతా లోటు (క్యాడ్‌), ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు తగ్గుముఖం పడతాయని, దీంతో అధిక జీడీపీ వృద్ధి రేటు సాధ్యపడుతుందని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ అంచనా వేసింది. ధరల స్థిరత్వానికి వీలుగా ఉత్పత్తికి కోత విధించే విషయంలో రష్యా, సౌదీ అరేబియా మధ్య విభేదాలు తలెత్తడంతో.. సౌదీ అరేబియా ఏకపక్షంగా ధరలను తగ్గించడం ఫలితంగా బ్యారెల్‌ చమురు 30 డాలర్లకు పడిపోయిన విషయం గమనార్హం. ఇక అదే సమయంలో ఓపెక్‌ దేశాలకు, రష్యా తదితర నాన్‌  ఓపెక్‌ దేశాల మధ్య ఉత్పత్తి కోతకు సంబంధించిన అంగీకార గడువు మార్చిలో గడువు తీరిపోనుంది. దీంతో రోజువారీ ఉత్పత్తి 10 మిలియన్‌ బ్యారెళ్లకు చేరుతుందని అనలిస్టులు భావిస్తున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రనపంచవ్యాప్తంగా చమురుకు డిమాండ్‌ తగ్గుతుండడం కూడా ధరలపై ప్రభావం చూపిస్తోంది. ‘‘చమురు ధర బ్యారెల్‌పై ప్రతీ 10 డాలర్ల పతనంతో 15 బిలియన్‌ డాలర్లు ఆదా అవుతుంది. ఇది జీడీపీలో క్యాడ్‌ 50 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గేలా చేస్తుంది’’ అని కోటక్‌ తన నివేదికలో పేర్కొంది. దేశం నుంచి జరిగే ఎగుమతుల విలువ కంటే దిగుమతుల విలువ ఎక్కువగా ఉండడాన్ని క్యాడ్‌గా పేర్కొంటారు. 

ఈ రంగాలకు మేలు
చమురు ధరలు తగ్గడం ఆటోమొబైల్స్, విమానయానం, రంగుల పరిశ్రమ, కన్జ్యూమర్‌ కంపెనీలు, సిటీ గ్యాస్‌ పంపిణీ సంస్థలు, చమురు విక్రయ సంస్థలకు కలసిసొస్తుందని కోటక్‌ తెలిపింది. కానీ, చమురు బ్యారెల్‌కు 35 డాలర్లకు దిగువన ఉంటే ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియాకు నికర నష్టాలు ఎదురవుతాయని అంచనా వేసింది. 

క్యాడ్‌ 0.7 శాతానికి తగ్గుతుంది
చమురు ధరల పతనంతో 2020–21 ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఖాతా లోటు 25 బేసిస్‌ పాయింట్లు తగ్గి జీడీపీలో 0.7 శాతానికి పరిమితం అవుతుందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. కరోనా వైరస్‌ జనవరిలో వెలుగు చూసిన తర్వాత నుంచి చమురు ధరలు 45 శాతం వరకు క్షీణించాయి. 2020–21 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 0.20 శాతం తగ్గించి 5.4 శాతానికి సవరించింది. ప్రపంచ వృద్ధి రేటు అంచనాలకు 0.60 శాతం కోత పెట్టి తాజాగా 2.2 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. ఒకవేళ అంతర్జాతీయ మాంద్యం ఏర్పడితే ప్రపంచ వృద్ధి రేటు 1.4 శాతానికి, భారత జీడీపీ వృద్ధి రేటు 4.4 శాతానికి తగ్గొచ్చని బ్యాంకు ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top