
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ సర్కార్ ప్రవేశపెట్టనున్న చిట్టచివరి పూర్తిస్థాయి బడ్జెట్‌పై అంచనాలు ఊపందుకున్నాయి. బడ్జెట్‌లో అద్భుతాలను ఆవిష్కరించకున్నా యువతకు ఉపాధి అవకాశాలను పెంచే చర్యలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని భావిస్తున్నారు. నూతన ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా బడ్జెట్ ఉంటుందని అంచనాలున్నాయి.
ఉపాధి రంగాలకు ఊతమిచ్చేలా ప్రభుత్వం ఆయా రంగాలకు ఉత్తేజం కల్పించాలని భారత ఎగుమతుల సంఘాల సమాఖ్య డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ కోరారు. దేశీయ ఎగుమతుల రంగం పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న క్రమంలో ఈ రంగానికి సర్కార్ ఊతం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. 1999లో 3.4 కోట్ల మందికి ఉపాధిని కల్పించిన ఎగుమతుల రంగం ప్రస్తుతం 6.2 కోట్ల మందికి ఉద్యోగావకాశాలను కల్పించిందన్నారు.