మోదీ ప్రభుత్వానికి హోలీ గిఫ్ట్‌

Indias GDP growth rises to 7.2% in December quarter - Sakshi

న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వానికి హోలీ కానుక అందింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండిబకాయిలు, పీఎన్‌బీలో చోటుచేసుకున్న భారీ కుంభకోణంతో సతమతమవుతున్న ప్రభుత్వానికి జీడీపీ డేటా గుడ్‌న్యూస్‌ అందించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశీయ జీడీపీ 7.2 శాతానికి పెరిగినట్టు వెల్లడైంది. తయారీ, ఖర్చులు పెరుగడంతో, జీడీపీ పెరిగినట్టు తెలిసింది. దీంతో ప్రధాని ప్రవేశపెట్టిన రెండు అతిపెద్ద షాక్‌ల నుంచి దేశం తేరుకుంటుందని తెలిసింది. 

2016 నవంబర్‌లో ప్రధాని నోట్‌ బ్యాన్‌ను ప్రవేశపెట్టగా.. 2017 జూలై 1 నుంచి జీఎస్టీని అమలు చేయడం ప్రారంభించారు. ఈ రెండు దేశీయ ఆర్థిక వ్యవస్థపై కొంత ప్రతికూల ప్రభావమే చూపాయి. ప్రస్తుతం వీటి నుంచి దేశీయ ఆర్థిక వ్యవస్థ కోలుకున్నట్టు నేడు వెల్లడైన జీడీపీ డేటాలో తెలిసింది. ఈ డేటా నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సరికొత్త ఉత్సాహాన్ని అందించింది. 

కాగ, 2017-18 మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6.7 శాతం ఉండగా.. ఆ ముందటి క్వార్టర్‌లో 6.1 శాతంగా ఉంది. జీడీపీ వృద్ధి రేటుతో పాటు ఎనిమిది కోర్‌ ఇన్‌ఫ్రా రంగాల డేటాను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. గతేడాది 3.4 శాతంగా ఉన్న ఈ రంగాల వృద్ధి రేటు, ప్రస్తుతం 6.7 శాతానికి పెరిగినట్టు తెలిసింది. ఎక్కువ మొత్తంలో వ్యయాలతో మోదీ ప్రభుత్వం దేశీయ ఆర్థిక వ్యవస్థను గాఢిలో పెడుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్‌ కింద 32.36 బిలియన్‌ డాలర్లను(రూ.2,10,971కోట్లకు పైగా) ప్రకటించింది.  

అదేవిధంగా 2019లో ఎన్నికలు ఉండటంతో వృద్ధికి బూస్ట్‌నిచ్చే మౌలిక సదుపాయాలు, సంక్షేమ ప్రాజెక్టులకు భారీ ఎత్తున్న ఖర్చు చేస్తోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు సైతం పెరిగింది. జీడీపీలో ఇది 3.5 శాతంగా ఉంది. గత నవంబర్‌లో దేశీయ పెట్టుబడుల గ్రేడ్‌ రేటింగ్‌ను కూడా మూడీస్‌ 14 ఏళ్లలో తొలిసారి అప్‌గ్రేడ్‌ చేసింది. వరల్డ్‌ బ్యాంకు డూయింగ్‌ బిజినెస్‌ రిపోర్టు 2018లో తొలిసారి భారత్‌ 30 స్థానాలు జంప్‌ చేసి టాప్‌-100లో చోటు దక్కించుకుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top