ఇండియన్‌ బ్యాంక్‌ 75% వృద్ధి

Indian Bank Profits 75 Percent Growth - Sakshi

క్యూ1లో లాభం రూ.366 కోట్లు

చెన్నై: ప్రభుత్వరంగ ఇండియన్‌బ్యాంకు జూన్‌ త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. బ్యాంకు లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.209 కోట్లతో పోలిస్తే 75 శాతం పెరిగి రూ.366 కోట్లకు చేరుకుంది. మొత్తం ఆదాయం కూడా రూ.5,132 కోట్ల నుంచి రూ.5,832 కోట్లకు వృద్ధి చెందింది. జూన్‌ త్రైమాసికంలో తాజాగా రూ.1,035 కోట్లు మొండి బకాయిలుగా మారాయి. అన్ని విభాగాల్లోనూ మెరుగైన వృద్ధి నమోదు చేసినట్టు ఇండియన్‌ బ్యాంకు ఎండీ, సీఈవో పద్మజ చుండూరు పేర్కొన్నారు.

‘‘తాజా ఎన్‌పీఏలకు కళ్లెం వేయడం వల్ల నికర లాభంలో 74.5 శాతం వృద్ధి నమోదైంది. తిరిగి గాడిలో పడ్డాం. ఒత్తిడిలోని రుణాలు ఎన్‌పీఏలుగా మారకుండా చర్యలు తీసుకుంటున్నాం’’ అని పద్మజ తెలిపారు. రానున్న త్రైమాసికాల్లో తాజా ఎన్‌పీఏలను రూ.800–900 కోట్లకు కట్టడి చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్టు ఆమె తెలిపారు. ‘‘రిటైల్, వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్యత తరహా విభాగాల్లో (ఎంఎస్‌ఎంఈ) వృద్ధి నెలకొంది. రిటైల్‌లో 25 శాతం, వ్యవసాయంలో 25 శాతం, ఎంఎస్‌ఎంఈ విభాగంలో 10 శాతం వృద్ధి సాధించాం. మొత్తం మీద క్యాపిటల్‌ అడెక్వసీ రేషియో 13.62 శాతంగా ఉంది. ఇది మాకు మరింత సౌకర్యాన్ని, నమ్మకాన్ని కలిగిస్తోంది’’ అని పద్మజ వివరించారు. మొబైల్‌ బ్యాంకింగ్‌లో లావాదేవీల్లో 300 శాతం వృద్ధి నమోదైనట్టు ఆమె చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top