సెన్సెక్స్‌ 36,980పైన... ర్యాలీ వేగవంతం

India Stocks Drop on Eve of Quarterly Earnings Reports - Sakshi

పలు దేశాల్లో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నా, ప్రతీ చిన్న క్షీణతలోనూ సైతం పెట్టుబడులు వెల్లువెత్తుతున్నందున, భారత్‌తో సహా అంతర్జాతీయ మార్కెట్లన్నీ కొద్దిపాటి ఒడిదుడుకులకు లోనైనా, గతవారం పటిష్టంగానే ట్రేడయ్యాయి. కొన్ని కార్పొరేట్లు వెల్లడించిన త్రైమాసికపు ఫలితాలు, ఆ సందర్భంగా ఆయా కంపెనీలు చేసిన ప్రకటనలే గతవారపు స్వల్ప హెచ్చుతగ్గులకు కారణం.

ఇక భారత్‌ విషయానికొస్తే బ్యాంకింగ్‌ షేర్ల నుంచి ఇతర రంగాలకు పెట్టుబడుల మళ్లింపు కొనసాగుతోంది. గతవారంరోజుల్లోనే బ్యాంక్‌ నిఫ్టీ ఇటీవలి గరిష్టస్థాయి నుంచి 8 శాతం వరకూ నష్టపోవడం ఇందుకు నిదర్శనం. నిఫ్టీ మాత్రం లాభంతో ముగిసింది. అయితే తిరిగి బ్యాంకింగ్‌ షేర్ల తోడ్పాటుతోనే భారత్‌ సూచీలు...గత శుక్రవారం కీలక అవరోధస్థాయిల్ని ఛేదించాయి. ఇక స్టాక్‌ సూచీల సాంకేతిక అంశాలకొస్తే...  

సెన్సెక్స్‌ సాంకేతికాంశాలు...
జూలై 17తో ముగిసినవారం ప్రథమార్ధంలో గత మార్కెట్‌ పంచాంగంలో ప్రస్తావించిన కీలక 200 రోజుల చలన సగటు రేఖ (200 డీఎంఏ) సమీపంలో గట్టి నిరోధాన్ని చవిచూసి 35,877 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయినప్పటికీ, ద్వితీయార్ధంలో వేగంగా కోలుకుని 200 డీఎంఏను ఛేదించింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 426 పాయింట్ల లాభంతో 37,020 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రస్తుతం 36,980 సమీపంలో వున్న  200 రోజుల చలన సగటు (200 డీఎంఏ) రేఖను సెన్సెక్స్‌ అధిగమించినందున, ఈ స్థాయిపైన స్థిరపడితే రానున్న రోజుల్లో ర్యాలీ మరింత వేగవంతం కావొచ్చు.

ఈ స్థాయిపైన సెన్సెక్స్‌ నిలదొక్కుకుంటే, కోవిడ్‌ కారణంగా పతనానికి దారితీసిన మార్చి తొలివారంనాటి బ్రేక్‌డౌన్‌ స్థాయి అయిన 37,740 పాయింట్ల స్థాయిని త్వరలో అందుకోవొచ్చు. ఈ స్థాయిని  సైతం ఛేదించగలిగితే, వచ్చే కొద్దిరోజుల్లో క్రమేపీ 38,380 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగే ఛాన్సు వుంటుంది. పైన ప్రస్తావించిన 36,980 పాయింట్లస్థాయిపైన సెన్సెక్స్‌ నిలదొక్కుకోలేకపోతే 36,525 సమీపంలో తొలి మద్దతు  లభిస్తోంది. ఈ స్థాయి దిగువన ముగిస్తే 36,030 వరకూ తగ్గవచ్చు. ఈ లోపున 35,870 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు.  

నిఫ్టీ కీలక స్థాయి 10,872...
గత మంగళవారం నిఫ్టీ కీలకమైన 200 డీఎంఏ రేఖ సమీపస్థాయి 10,890 పాయింట్ల వరకూ పెరిగి, వెనువెంటనే 10,562 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమయ్యింది. అటుతర్వాత అంతేవేగంతో రిక వరీ అయ్యి, కీలక అవరోధస్థాయిని దాటి, 10,933 పాయింట్ల గరిష్టస్థాయిని అందుకుంది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 134 పాయింట్ల లాభంతో 10,902 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రస్తుతం 200  డీఎంఏ రేఖ కదులుతున్న 10,872 పాయింట్ల స్థాయి నిఫ్టీకి ఈ వారం కీలకం.

ఈ స్థాయిపైన 11,035 పాయింట్ల వరకూ వేగంగా పెరిగే అవకాశం వుంటుంది. ఈ స్థాయిపైన ముగిస్తే, స్వల్ప ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, క్రమేపీ కొద్దిరోజుల్లో 11,245 వరకూ ర్యాలీ జరిపే ఛాన్స్‌ వుంటుంది.  ఈ వారం నిఫ్టీ 10,872 పాయింట్ల స్థాయిని పరిరక్షించుకోలేకపోతే 10,750 సమీపంలో తొలి మద్దతు  లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తే 10,595 వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 10,560 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు.
– పి. సత్యప్రసాద్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top