వృద్ధి వేగంలో భారత్‌ టాప్‌

India GDP growth forecast to 7 point 3 Percentager 2019 20 - Sakshi

ఐఎంఎఫ్‌ నివేదిక

2019లో 7.3 శాతం వృద్ధి అంచనా

2020లో ఈ రేటు 7.5 శాతంగా విశ్లేషణ

వినియోగం, పెట్టుబడుల దన్ను 

వాషింగ్టన్‌: ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ మొదటి స్థానంలో ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) స్పష్టం చేసింది. 2019లో భారత్‌ వృద్ధిరేటు 7.3 శాతంగా ఉంటుందని, 2020లో ఈ రేటు 7.5 శాతంగా నమోదుకానుందని ఐఎంఎఫ్‌ విశ్లేషించింది. పెట్టుబడుల్లో వేగవంతమైన రికవరీ నమోదవుతోందని, వినియోగ పరిస్థితులు గణనీయంగా మెరుగుపడుతున్నాయని ఐఎంఎఫ్‌ పేర్కొంటూ, భారత్‌ వృద్ధి పటిష్టతకు ఈ అంశాలు  కీలకపాత్ర పోషిస్తున్నాయని విశ్లేషించింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా (2019–20) వృద్ధిరేటు అంచనాలను మాత్రం 7.4 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది.  ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్‌ వార్షిక స్పింగ్‌ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై సోమవారం ప్రపంచబ్యాంక్‌ అవుట్‌లుక్‌ విడుదలకాగా, మంగళవారం ఐఎంఎఫ్‌ కూడా ఈ మేరకు ఒక నివేదికను ఆవిష్కరించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... 

►2018లో భారత్‌ వృద్ధి రేటు 7.1 శాతం. చైనా 6.6 శాతం వృద్ధిరేటుకన్నా ఇది అధికం. 2019, 2020ల్లో చైనా వృద్ధిరేట్లు వరుసగా 6.3 శాతం, 6.1 శాతం ఉంటాయని భావిస్తున్నాం.  

►ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం, దీనితో వడ్డీరేట్ల తగ్గుదల భారత్‌ వృద్ధి జోరు కారణాల్లో కొన్ని. 

►మధ్యకాలికంగా చూస్తే, 7 శాతం స్థాయిలో భారత్‌ వృద్ధి స్థిరీకరణ పొందే అవకాశం ఉంది. వ్యవస్థాగత సంస్కరణల అమలు, మౌలిక ప్రాజెక్టుల విషయంలో అవరోధాల తొలగింపు ఈ అంచనాలకు కారణం.  

►భారత్‌లో వ్యవస్థాగత, ఫైనాన్షియల్‌ రంగాలకు సంబంధించి సంస్కరణలు కొనసాగుతాయని విశ్వసిస్తున్నాం.  

► ప్రభుత్వ రుణం తగిన స్థాయిలో ఉంచడం వృద్ధి పటిష్టతకు దోహదపడే అంశాల్లో ఒకటి. ఈ అంశంసహా ద్రవ్యలోటు కట్టడికి భారత్‌ తగిన చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నాం.   

►ఫైనాన్షియల్‌ రంగం పటిష్టతకు వస్తే, కంపెనీల బ్యాలెన్స్‌ షీట్ల మెరుగునకు తగిన ప్రయత్నం జరగాలి. సరళీకృత దివాలా విధానాల పరిధిలో మొండిబకాయిలు (ఎన్‌పీఏ) ఉండాలి. అంటే ఎన్‌పీఏల సమస్య క్లిష్టత లేకుండా పరిష్కారమయ్యే అవకాశాలు ఉండాలి. బ్యాంకింగ్‌ రంగం మెరుగుపడే దిశలో ఈ చర్యలు ఉండాలి.  

►భూ సంస్కరణలు, మౌలిక రంగ వృద్ధి వంటి అం శాల్లో వేగవంతమైన పురోగతి ఉండాలి. ఇది ఉ పాధి కల్పన మెరుగుదలకూ దోహదపడుతుంది.  
ఉద్దీపన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, 2019, 2020ల్లో చైనా వృద్ధి నెమ్మదిగానే ఉండే వీలుంది.  

►2018లో అంతర్జాతీయ వృద్ధి మందగమనంలోకి జారింది. చివరి ఆరు నెలల కాలంలో ఈ పరిస్థితి మరింత క్షీణించింది. చైనా–అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం అంశాలు దీనికి ప్రధాన కారణం.

ప్రపంచ వృద్ధిరేటు అంచనాకు కోత
2019లో ప్రపంచ వృద్ధి రేటు అంచనాకు ఐఎంఎఫ్‌ కోత పెట్టింది. వృద్ధి 3.3 శాతమే నమోదవుతుందని తాజా అంచనాల్లో పేర్కొంది. 2020ల్లో ఈ రేటు 3.6 శాతంగా విశ్లేషించింది. ఇంతక్రితం ఈ రెండు సంవత్సరాల్లో 3.7 శాతం వృద్ధి నమోదవుతుందని ఐఎంఎఫ్‌ అంచనావేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ‘సున్నితమైన పరిస్థితి’’ని ఎదుర్కొంటోందని తెలిపింది.  వాణిజ్య యుద్ధం, బ్రెగ్జిట్, చమురు ఉత్పత్తి దేశాల్లో ఉద్రిక్తతలు, ఉద్దీపనలను వెనక్కు తీసుకుంటే, జరగబోయే పరిణామాలపై అనిశ్చితి వంటి అంశాలను ఐఎంఎఫ్‌ ఈ సందర్భంగా ప్రస్తావించింది.  పన్నుల వ్యవస్థలను ఆధునీకరించడం, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయడం ద్వారా ప్రజా రుణాలు, సంపద అసమానతలను తగ్గించడం వంటి గత సూచనలను సభ్య దేశాలు ఆచరణలో పెట్టాలని ఐఎంఎఫ్‌ సూచించింది. 2019లో ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, 70 శాతం ఆర్థిక వ్యవస్థలు మందగమన పరిస్థితులను ఎదుర్కొనవచ్చని త్రైమాసిక నివేదిక పేర్కొంటున్నట్లు ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ గీతా గోపీనాథ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top