ఇండియా సిమెంట్స్‌ లాభం రూ. 44 కోట్లు

India Cements Profit 44 Crore - Sakshi

చెన్నై: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఇండియా సిమెంట్స్‌ సంస్థ రూ. 44 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ. 35 కోట్లు. మరోవైపు ఆదాయం రూ. 1,402 కోట్ల నుంచి రూ. 1,581 కోట్లకు పెరిగింది. సిమెంటు అమ్మకాలు గణనీయంగా పెరగడం ఆర్థిక ఫలితాలు మెరుగుపడేందుకు తోడ్పడిందని సంస్థ వైస్‌ చైర్మన్‌ ఎన్‌ శ్రీనివాసన్  తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం రెండో విడతలోనూ మౌలిక సదుపాయాల అభివృద్ధి, గృహ నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు పెంచడంపై మరింతగా దృష్టి సారించగలదని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీంతో సిమెంటుకు మంచి డిమాండ్‌ ఉండగలదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి–మార్చి మధ్యకాలంలో ప్లాంట్ల సామర్థ్య వినియోగం 79 శాతం నుంచి 84 శాతానికి పెరిగిందని శ్రీనివాసన్‌ ఈ సందర్భంగా చెప్పారు.

జగన్ అభివృద్ధికి సానుకూలం.....
మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికారం దక్కించుకోవడంపై స్పందిస్తూ..‘జగన్‌మోహన్‌ రెడ్డి ప్రధానంగా అభివృద్ధికి సానుకూలంగా ఉంటారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో సిమెంటుకు డిమాండ్‌ గణనీయంగా పెరగగలదని ఆశిస్తున్నా. అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కూడా సరైన ట్రాక్‌లో ఉంది. కచ్చితంగా అభివృద్ధికి అనుకూలంగానే ఉంటుందని, ఇన్ఫ్రా అభివృద్ధి, హౌసింగ్‌పై దృష్టి కొనసాగిస్తుందని భావిస్తున్నాను‘ అని శ్రీనివాసన్‌ తెలిపారు. భారీ సాగునీటి ప్రాజెక్టుల కారణంగా తెలంగాణలో కూడా సిమెంటుకు మంచి డిమాండ్‌ ఉండగలదని భావిస్తున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి నుంచి క్రమంగా పెరుగుతున్న సిమెంటు ధరలు సమీప భవిష్యత్‌లో స్థిరపడవచ్చని ఆయన పేర్కొన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top