జీఎస్‌టీ 2.0 అమల్లోకి తేవాలి

GST 2.0 ON Preparing for integration of e-way bills with GST returns - Sakshi

పరిశ్రమవర్గాల అభిప్రాయం

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్‌టీ) రెండో దశను (2.0) అమల్లోకి తేవాల్సిన సమయం వచ్చిందని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. విద్యుత్, చమురు, గ్యాస్, రియల్‌ ఎస్టేట్, ఆల్కహాల్‌ను కూడా దీని పరిధిలోకి తీసుకురావడం ద్వారా పన్ను సంస్కరణలకు మరింత ఊతమివ్వాల్సిన అవసరముందని పేర్కొన్నాయి. అలాగే పన్ను రేటును 2–3 శ్లాబులకు పరిమితం చేయాలని కోరాయి. ‘జీఎస్‌టీ అమల్లోకి వచ్చి రెండేళ్లయింది. ఇక జీఎస్‌టీ 2.0ని అమలు చేయాల్సిన తరుణం వచ్చింది. ఇది దేశ ఎకానమీని తదుపరి వృద్ధి స్థాయికి చేర్చగలదు‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్‌ విక్రమ్‌ కిర్లోస్కర్‌ తెలిపారు.  ప్రారంభ దశలో ఎదురైన పలు సవాళ్లను అధిగమించిన నేపథ్యంలో పరోక్ష పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేయాలన్న లక్ష్య సాధన దిశగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఫిక్కీ ప్రెసిడెంట్‌ సందీప్‌ సోమానీ పేర్కొన్నారు.

మరోవైపు రిటర్నుల ఫైలింగ్‌ల్లోనూ.. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్స్‌ల్లోనూ వ్యత్యాసాలు ఉన్నా, పన్నులు ఎగవేసినా ఆయా సంస్థల ప్రమోటర్లు, డైరెక్టర్లు, ప్రొప్రైటర్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నట్లు జీఎస్‌టీ నెట్‌వర్క్‌ సీఈవో ప్రకాష్‌ కుమార్‌ తెలిపారు. దీనివల్ల తెలియక చేసిన తప్పులేమైనా ఉంటే వారు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుందని ఆయన వివరించారు. ఇందుకోసం ప్రత్యేక జీఎస్‌టీ వ్యవస్థను రూపొందించినట్లు కుమార్‌ చెప్పారు. ఐటీసీ క్లెయిమ్‌లు, రిటర్నుల్లో తేడాలున్న పక్షంలో ఆయా అసెసీలకు అలర్ట్‌లు పంపడంతో పాటు ఆదాయ పన్ను శాఖకు సమాచారం అందించడం జరుగుతుందని ఆయన వివరించారు. మరోవైపు వరుసగా రెండు నెలల పాటు జీఎస్‌టీఆర్‌–3బి దాఖలు చేయని సంస్థలకు ఆగస్టు 22 నుంచి ఈ–వే బిల్లుల జారీ నిలిపివేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 1.22 కోట్ల వ్యాపార సంస్థలు జీఎస్‌టీ కింద నమోదయ్యాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top