ఫుజిట్సు జనరల్‌ నూతన ఏసీల శ్రేణి | Fujitsu General mulls AC unit | Sakshi
Sakshi News home page

ఫుజిట్సు జనరల్‌ నూతన ఏసీల శ్రేణి

Feb 16 2018 1:03 AM | Updated on Feb 16 2018 1:03 AM

Fujitsu General mulls AC unit - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  ప్రీమియం ఎయిర్‌ కండీషనర్ల తయారీ కంపెనీ ఫుజిట్సు జనరల్‌ నూతన శ్రేణి మోడళ్లను గురువారమిక్కడ ప్రవేశపెట్టింది. మొత్తం 26 రకాల జనరల్‌బ్రాండ్‌ ఏసీ మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. ధరల శ్రేణి రూ.25,200 నుంచి మొదలై రూ.1,52,250 వరకు ఉంది.

భారత్‌లో సూపర్‌ ప్రీమియం బ్రాండ్‌లో తమ కంపెనీ మాత్రమే పోటీపడుతోందని ఫుజిట్సు జనరల్‌ సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఈజీపీఎల్‌ సీఈవో ఎం.ఇజాజుద్దీన్‌ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. జనరల్‌ బ్రాండ్‌కు దేశీయంగా 4 శాతం వాటా ఉందన్నారు. ‘2017లో దేశవ్యాప్తంగా వివిధ కంపెనీల ఏసీలు 60 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. పరిశ్రమ 15–20 శాతం వార్షిక వృద్ధి నమోదు చేస్తోంది. రెండేళ్లలో జనరల్‌ వాటా 5%కి చేరుతుందన్న విశ్వాసం ఉంది’ అని చెప్పారు.
 
ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంటు..
: ఫుజిట్సు జనరల్‌ భారత్‌లో ఏసీల తయారీ ప్లాంటు ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌ లేదా తెలంగాణలో ఈ ప్లాంటు రానుంది. ప్రధాన విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉన్నందున నౌకాశ్రయం ఉన్న ఆంధ్రప్రదేశ్‌ వైపు కంపెనీ మొగ్గు చూపుతోంది. మొత్తంగా 2–3 ఏళ్లలో ఈ యూనిట్‌ సాకారం అవుతుంది. ప్లాంటు కోసం సుమారు రూ.1,260 కోట్లు వ్యయం చేస్తామని ఫుజిట్సు జనరల్‌ ప్రెసిడెంట్‌ ఎట్సురో సైటో వెల్లడించారు. భారత్‌తోపాటు ఇతర దేశాలకు ఇక్కడి నుంచి ఏసీలను ఎగుమతి చేస్తామని చెప్పారు. మాతృ సంస్థ అమ్మకాల్లో 10 శాతం వాటాతో భారత్‌ తొలి స్థానంలో ఉందన్నారు.

Advertisement

పోల్

Advertisement