కొనుగోళ్ల వేటలో ఫ్లిప్‌కార్ట్‌ | Flipkart and Urban Ladder – a match made in retailer-heaven? | Sakshi
Sakshi News home page

కొనుగోళ్ల వేటలో ఫ్లిప్‌కార్ట్‌

Oct 24 2017 12:41 AM | Updated on Aug 1 2018 3:40 PM

 Flipkart and Urban Ladder – a match made in retailer-heaven? - Sakshi

బెంగళూరు: తాజాగా పెద్ద ఎత్తున నిధులు సమీకరించిన ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌... తన కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి సారిస్తోంది. పోటీ సంస్థ అమెజాన్‌ను దీటుగా ఎదుర్కొనే క్రమంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడం, ఇతరత్రా సంస్థల కొనుగోళ్లపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ, సేవల సంస్థ అర్బన్‌ క్లాప్, ఫర్నిచర్‌ రిటైలింగ్‌ సంస్థ అర్బన్‌ ల్యాడర్‌ వంటి సంస్థలతో చర్చలు జరుపుతోంది.

వీటితో పాటు బీమా, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రంగాల్లోని కొన్ని స్టార్టప్‌ సంస్థలనూ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సంస్థ బుక్‌మైషోలోనూ వాటాల కొనుగోలు కోసం ఫ్లిప్‌కార్ట్‌ చర్చలు జరుపుతున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. ఈ డీల్‌ ప్రకారం బుక్‌మైషో విలువను దాదాపు 500–700 మిలియన్‌ డాలర్ల మేర లెక్కగడుతున్నట్లు సమాచారం.

మారుతున్న వ్యూహం..
ఫ్లిప్‌కార్ట్‌ గతంలోనూ పెట్టుబడులు పెట్టడం, కంపెనీలను కొనుగోళ్ళు చేయడం వంటి లావాదేవీలు జరిపినప్పటికీ.. ప్రస్తుత వ్యూహం మారుతోందని పరిశీలకులు చెబుతున్నారు. 2014–15 ప్రాంతంలో ఫ్లిప్‌కార్ట్‌.. వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ తరహాలో ఇన్వెస్ట్‌ చేసింది. ఆ రెండేళ్లలో ఫ్యాషన్‌ రిటైలర్‌ మింత్రా, ట్రక్కింగ్‌ మార్కెట్‌ప్లేస్‌ బ్లాక్‌ బక్, అడ్వరై్టజింగ్‌ టెక్నాలజీ స్టార్టప్‌ యాడ్‌ ఈక్విటీ వంటి దాదాపు పన్నెండు సంస్థల్లో పెట్టుబడులు పెట్టడమో, కంపెనీలను కొనుగోలు చేయడమో జరిపింది.

అయితే, ఈ లావాదేవీలన్నీ కూడా నేరుగా ఫ్లిప్‌కార్ట్‌ వ్యాపారాన్ని పెంచేవి కాకుండా.. కేవలం ఆర్థికపరమైన పెట్టుబడులుగానే జరిగాయి. కానీ ప్రస్తుతం నేరుగా తమ వ్యాపారానికే దోహదపడేటువంటి భారీ, వ్యూహాత్మక డీల్స్‌పై మాత్రమే ఫ్లిప్‌కార్ట్‌ దృష్టి సారిస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం సంస్థ భారీగానే వెచ్చించదల్చుకుంది. ఇటీవల సెప్టెంబర్‌లో కార్పొరేట్‌ వ్యవహారాల శాఖకు  సమర్పించిన ఫైలింగ్స్‌ ప్రకారం.. కొనుగోళ్లు, గణనీయమైన పెట్టుబడుల కోసం కేటాయింపులను సుమారు రూ.8,000 కోట్లకు పెంచినట్లు తెలుస్తోంది.

గతంలో ఇది రూ. 3,000 కోట్లకే పరిమితమైంది. ఫ్లిప్‌కార్ట్‌ కొత్త వ్యూహం చూడబోతే... గడిచిన దశాబ్దకాలంగా భారీ చైనా ఇంటర్నెట్‌ కంపెనీలు అనుసరించిన విధానాల్లాగానే కనిపిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. చిన్న స్థాయి పోటీ సంస్థలను కొనేయడం, భారీ ఇంటర్నెట్‌ స్టార్టప్స్‌లో వ్యూహాత్మక వాటాలు కొనుగోలు చేయడంలాంటివి ఇలాంటి వ్యూహాలే. ఫ్లిప్‌కార్ట్‌ ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి సారిస్తోంది.

పరిమాణంపరంగా దిగ్గజ స్థాయికి ఎదగడం ద్వారా పుష్కలంగా నిధులున్న అమెజాన్‌ వంటి దిగ్గజాల నుంచి పోటీ తీవ్రమైనా.. తట్టుకుని నిలబడగలిగేలా పటిష్టం కావడం ఒక వ్యూహం. కాగా, అదే సమయంలో మార్కెట్లో పెనుమార్పులు చోటుచేసుకున్నా ప్రధాన వ్యాపారం దెబ్బ తినకుండా కాపాడుకోవడం మరో వ్యూహంగా తెలుస్తోంది.


4 బిలియన్‌ డాలర్ల నిధులు..
2007లో కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి ఫ్లిప్‌కార్ట్‌ 20 పైగా కంపెనీలను కొనుగోలు చేయడమో లేదా ఇన్వెస్ట్‌ చేయడమో జరిగింది. 2014 ఏకంగా 330 మిలియన్‌ డాలర్లు పెట్టి మింత్రాను కొనుగోలు చేయడం అతి పెద్ద డీల్‌. ఈ ఏడాది తొలినాళ్లలో మరో పోటీ సంస్థ, ఆర్థిక సంక్షోభంలో ఉన్న స్నాప్‌డీల్‌ను కూడా సుమారు  బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసేందుకు యత్నించింది.

అయితే, వేల్యుయేషన్స్, డీల్‌ స్వరూపంపై విభేదాలతో ఇది కుదరలేదు. 15 బిలియన్‌ డాలర్ల దేశీ ఈ–కామర్స్‌ మార్కెట్లో అమెరికన్‌ దిగ్గజం అమెజాన్‌కి దీటైన పోటీ ఇచ్చేలా ఫ్లిప్‌కార్ట్‌ కొన్నాళ్ల క్రితమే 3 బిలియన్‌ డాలర్ల మేర నిధులు సమీకరించింది. సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్, టెన్సెంట్‌ హోల్డింగ్స్, ఈబే, మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ మొదలైనవి ఇన్వెస్ట్‌ చేశాయి. తమ దగ్గర దాదాపు 4 బిలియన్‌ డాలర్ల మేర నగదు నిల్వలున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ ఆగస్టులో వెల్లడించింది.

అయితే, మార్కెట్‌ మందగమనం నేపథ్యంలో అమ్మకాలు పెంచుకునేందుకు ఫ్లిప్‌కార్ట్‌ ఇతరత్రా డీల్స్‌పై దృష్టి సారించాల్సి ఉంటుందన్నది పరిశీలకుల అభిప్రాయం. ఫ్లిప్‌కార్ట్‌కి చెందిన పేమెంట్స్‌ యాప్‌ ఫోన్‌పే.. మరో పోటీ సంస్థ పేటీఎం, అమెజాన్‌ పేతో పోటీపడుతోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇన్వెస్ట్‌ చేసిన సాఫ్ట్‌బ్యాంక్‌ అటు పేటీఎంలో కూడా ఇన్వెస్టర్‌ కావడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement