పెట్రోల్, డీజిల్‌ జీఎస్టీలోకి చేర్చినా ఇంతే పన్ను!

Even if petrol comes under GST, it may not exclude VAT - Sakshi

28 శాతం జీఎస్టీకి తోడు రాష్ట్రాల పన్నులు

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలోకి తెస్తే అధిక పన్నుల భారం తొలగి ఇంధన ధరలు తగ్గుముఖం పడతాయన్న డిమాండ్లు వినిపిస్తుండగా... జీఎస్టీలోకి మార్చినా పన్నుల భారం ఇదే స్థాయిలో ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. జీఎస్టీలోకి చేర్చినా గరిష్ట పన్ను శ్లాబు 28 శాతానికి తోడు రాష్ట్రాల్లో వ్యాట్‌ కలిపితే... ప్రస్తుతమున్న ఎక్సైజ్‌ పన్ను, వ్యాట్‌ స్థాయిలోనే ఉంటుందని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు.

పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ కిందకు తీసుకురావడానికి ముందు కేంద్రం రూ.20,000 ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను వదులుకుంటుందా అన్నదానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ‘‘ప్రపంచంలో ఎక్కడా కూడా పెట్రోల్, డీజిల్‌పై అచ్చమైన జీఎస్టీ అమల్లో లేదు. కనుక మన దగ్గర కూడా జీఎస్టీ+వ్యాట్‌ కలయికతోనే ఉంటుంది. అయితే, జీఎస్టీలోకి పెట్రో ఉత్పత్తులను చేర్చడం అన్నది రాజకీయపరమైన నిర్ణయం. కేంద్రం, రాష్ట్రాలు కలసి ఉమ్మడిగా తీసుకోవాల్సి ఉంటుంది’’ అని ఆ అధికారి చెప్పారు.

ప్రస్తుతం కేంద్రం పెట్రోల్‌పై రూ.19.48, డీజిల్‌పై రూ.15.33 మేర ఎక్సైజ్‌ సుంకం రాబడుతోంది. దీనికి అదనంగా రాష్ట్రాలు వ్యాట్‌ వేస్తున్నాయి. దేశంలో అతి తక్కువగా అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో సేల్స్‌ ట్యాక్స్‌ పెట్రోల్, డీజిల్‌పై 6 శాతమే ఉంది. ముంబైలో అత్యధికంగా 39.12 శాతం అమలవుతోంది. తెలంగాణ రాష్ట్రం 26 శాతం వ్యాట్‌ను డీజిల్‌పై వసూలు చేస్తోంది. ఢిల్లీలో పెట్రోల్‌పై 27 శాతం, డీజిల్‌పై 17.24 శాతం వ్యాట్‌ అమలవుతోంది. ఈ పన్నుల భారం పెట్రోల్‌ ధరలో 45–50 శాతం మేర ఉంటుండగా, డీజిల్‌ ధరలో 35.40 శాతం మేర ఉంటోంది.  

పన్ను తగ్గే అవకాశం లేదు
‘‘ఈ స్థాయిలో పన్నులు అమలవుతున్నందున జీఎస్టీలో పెట్రోల్, డీజిల్‌లను 28 శాతం పన్ను శ్లాబుకే పరిమితం చేస్తే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోతాయి. రాష్ట్రాలకు ఆదాయలోటును భర్తీ చేసేందుకు కేంద్రం వద్ద నిధులు లేవు. కనుక జీఎస్టీలో గరిష్ట పన్నుకు తోడు వ్యాట్‌ అమలుకు అనుమతించడం ద్వారా పన్ను ప్రస్తుతమున్న స్థాయికి మించకుండా చూడటమే’’ అని ఆ అధికారి వివరించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top