సూపర్ ఎఫీషియంట్‌ ఏసీ : ఇంధనం ఆదా, తక్కువ ధర

EESL targets ACs launches super efficient AC at Rs 41300 in Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తక్కువ విద్యుత్‌, అందుబాటులో ధరల్లో ఎల్‌ఈడీ  ఉత్పత్తులను (ట్యూబ్‌ లైట్స్‌, బల్బులు, ఫాన్స్‌) పరిచయం చేసి విజయవంతమైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్ఎల్‌) మరో కీలక ఆవిష్కరణకు నాంది పలికింది. పవర్‌ సేవ్‌, సూపర్ ఎఫిషియంట్‌ ఎయిర్ కండిషనర్‌(ఏసీ) లను ఢిల్లీలో  నేడు (సోమవారం,జూలై 8) లాంచ్‌ చేసింది.  మార్కెట్‌లో ప్రస్తుతం లభిస్తున్న ఏసీల ధరలతో పోలిస్తే…ఈ ఏసీలు 30 శాతం తక్కువ ధరకు లభ్యం. నాలుగు ప్రభుత్వ రంగ సంస్థల జాయింట్‌ వెంచర్‌ (రాజధాని పవర్‌ లిమిటెడ్‌, యమునా పవర్‌ లిమిటెడ్‌, టాటా పవర్‌ డీడీఎల్‌ ) అయితే ఈఈఎస్‌ఎల్‌ వీటిని ఆవిష్కరించింది. మొదటి దశలో 50వేల ఏసీలను  ఢిల్లీలోని వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. వీటి ధరను రూ. 41,300 గా నిర్ణయించింది.

తాము లాంచ్‌ చేసిన  కొత్త ఏసీల ద్వారా  50 శాతం  విద్యుత్తు ఆదా అవుతుందని  కంపెనీ చెబుతోంది.1.5 టన్నుల ఇన్వర్టర్ స్ప్లిట్ ఎసిలు 5.4 శక్తి సామర్థ్య రేటింగ్ కలిగి ఉన్నాయని,  ప్రస్తుతమున్న బీఇ 5 స్టార్ రేటెడ్ ఎసిల కంటే 20 శాతం ఎక్కువ సామర్థ్యం వీటి  సొంతమని ప్రకటించింది.  4.5 సామర్థ్యం కలిగిన ఫైవ్ స్టార్ రేటెడ్  ఏసీ 1155 వాట్ల వద్ద పనిచేస్తుంది. కానీ తమ ఏసీలు  కేవలం 960 వాట్ల వద్ద అదే పనితీరును  కనబరుస్తాయని తెలిపింది. తద్వారా సగటున ఏడాదికి 300 యూనిట్లు లేదా 2400 రూపాయలు ఆదా అవుతుందని పేర్కొంది. అలాగే మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న త్రీ స్టార్‌ ఏసీలతో పోలిస్తే  ఏడాదికి  4వేల రూపాయలు పొదుపు చేయవచ్చని తెలిపింది.

ముఖ‍్యంగా గ్లోబల్ వార్మింగ్ ముప్పును ఎదుర్కొనే  చర్యల్లో భాగంగా  ఈ సూపర్ ఎఫెక్టివ్ ఏసీలను  తీసుకొచ్చామని ఈఈఎస్‌ఎల్‌ ఎండీ సౌరభ్‌ కుమార్‌ తెలిపారు. భారతదేశానికి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎంపికల కంటే చాలా స్థిరమైన, సరసమైన శీతలీకరణ అవసరం. ఈ  లక్ష్యాన్ని సూపర్ ఎఫిషియంట్‌ ఎయిర్ కండిషనర్లు తీర్చనున్నాయన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి మొత్తం స్టాక్‌ హాట్‌ సేల్‌  పూర్తి కానుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.  తరువాతి సీజన్‌ నాటికి దేశ వ్యాప్తంగా 2లక్షల యూనిట్లను అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కుమార్‌ చెప్పారు. త్వరలోనే ఇ-కామర్స్  మార్కెట్‌లో లభ్యం కానున్న ఈ ఏసీలు ఫస్ట్‌ కం ఫస్ట్‌ సర్వ్‌ ప్రాతిపదికన ఈఈఎస్ఎల్‌మార్ట్‌.ఇన్‌ ద్వారా మాత్రమే లభ్యం కానున్నాయి.  ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా ఆకర్షణీయమైన ఈఎంఐ ఆఫర్‌, ఉచిత రిపేర్‌ సర్వీసు, ఫిర్యాదుల పరిష్కార మద్దతుతదితర సేవలను  ఆఫర్‌ చేస్తోంది. అంతేకాదు అప్‌గ్రేడ్‌ కావాలనుకున్న కస‍్టమర్లకు  బై బ్యాక్‌ఆఫర్‌ను కూడా అందిచనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top