అకౌంట్లోకి 10 కోట్లు, డ్రా చేసుకోవడానికి వెళ్తే..

Delhi Mans SBI Account Mysteriously Gets Nearly Rs 10 crore - Sakshi

న్యూఢిల్లీ : రాజధాని ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఒక్కసారిగా మిలీనియర్‌ అయిపోయాడు. అనుకోకుండా ఆయన బ్యాంకు అకౌంట్‌లోకి రూ.9,99,99,999 నగదు వచ్చి చేరింది. అంటే దాదాపు రూ.10 కోట్లన్నమాట. వివరాల్లోకి వెళ్తే.. వినోద్‌ కుమార్‌ అనే వ్యక్తి ఢిల్లీలో మొబైల్‌ షాపు నడుపుతున్నాడు. అతని అకౌంట్‌లోకి రూ.9,99,99,999 నగదు క్రెడిట్‌ అయినట్టు వినోద్‌కు ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ వచ్చింది. ఒక్కసారిగా అతని అకౌంట్‌లోకి ఇంత నగదు వచ్చి చేరడంతో, వినోద్‌, అతని కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. లక్షాధికారి హోదాతో మురిసిపోయిన వినోద్‌, ఈ నగదును విత్‌డ్రా చేయడానికి ఏటీఎంకి వెళ్లాడు. కానీ ఆ ఆనందమంతా సెకన్లలో ఆవిరైపోయింది. అతని అకౌంట్‌ బ్లాక్‌ అయినట్టు ఏటీఎం చూపించింది.  

వినోద్‌, తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలోని జహంగిర్‌పురి ఏరియాలో నివాసముంటున్నాడు. జహంగ్‌పురిలోని ఎస్‌బీఐ బ్రాంచులో అతను సేవింగ్స్‌ అకౌంట్‌ కలిగి ఉన్నాడు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వినోద్‌కు ఈ ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ వచ్చింది. తొలుత ఇదేదో మెసేజ్‌ అని భావించిన వినోద్‌, తర్వాత ఆ మెసేజ్‌ను అతని స్నేహితులు, కుటుంబసభ్యులకు చూపించాడు. ఆ మెసేజ్‌ చూసిన వారు, నిజంగానే వినోద్‌ ఖాతాలో రూ.9,99,99,999 కోట్లు క్రెడిట్‌ అయినట్టు చెప్పారు. దీంతో తాను ఒక్కసారిగా లక్షాధికారి అయిపోయినట్టు తెలుసుకున్నాడు. వెంటనే ఏటీఎం వద్దకు పరిగెత్తాడు. కానీ లక్షాధికారి అయిపోయాయనే ఆనందం వినోద్‌కు క్షణాల్లో ఆవిరై పోయి, అకౌంట్‌ బ్లాక్‌ అయినట్టు తెలిసింది. ఈ సంఘటనపై నేడు వినోద్‌ బ్రాంచు మేనేజర్‌ను కలిసినట్టు తెలిసింది. తన అకౌంట్‌ను అన్‌బ్లాక్‌ చేసుకోవడానికి ఓ అప్లికేషన్‌ కూడా సమర్పించినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top