టూరిజం కుదేలు...

Coronavirus pandemic denting tourism Sector - Sakshi

ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వెల్లడి

స్థిరీకరణ నిధితో ఆదుకోవాలని వినతి

కోల్‌కతా: కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి దేశీ పర్యాటక, ఆతిథ్య రంగాలు ఊహించనంత వేగంగా కుదేలవుతున్నాయని ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఐసీసీ) ఆందోళన వ్యక్తం చేసింది. టూరిజం శాఖ గణాంకాల ప్రకారం జనవరి–మార్చి త్రైమాసికంలో విదేశీ టూరిస్టుల రాక (ఎఫ్‌టీఏ) 67 శాతం, దేశీయంగా టూరిస్టుల ప్రయాణాలు 40 శాతం పడిపోయాయని వెల్లడించింది. ‘కరోనా వైరస్‌ ప్రతికూల ప్రభావంతో దేశవ్యాప్తంగా హాస్పిటాలిటీ రంగంలో ఆక్యుపెన్సీ 18–20 శాతం పడిపోయే అవకాశం ఉంది. మొత్తం 2020లో సగటు రోజువారీ రేట్లు 12–14 శాతం తగ్గిపోవచ్చు‘ అని ఐసీసీ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ సింగ్‌ చెప్పారు. సుమారు 2.67 కోట్ల ఉద్యోగాల కల్పనతో ట్రావెల్, టూరిజం రంగం 2018లో దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 9.2 శాతం వాటా దక్కించుకుందని ఆయన తెలిపారు.
 
కరోనా సంక్షోభంలో చిక్కుకున్న చాలా మటుకు టూరిజం సంస్థలు కనీసం ఆరు నెలల పాటైనా ఈఎంఐలు, పన్నులు, ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల నుంచి తాత్కాలిక ఊరట కోసం ఎదురుచూస్తున్నాయని సింగ్‌ వివరించారు. ఈ నేపథ్యంలో టూరిజం, ట్రావెల్, హాస్పిటాలిటీ సంస్థలకు టర్మ్‌ రుణాల రీపేమెంట్‌పై మారటోరియం వ్యవధిని ఆరు నెలలకు వర్తింపచేయాలని, తదుపరి 12 నెలలకు జీఎస్‌టీ హాలిడే ప్రకటించి తోడ్పాటునివ్వాలని కేంద్రాన్ని ఐసీసీ కోరింది. ఆయా సంస్థలు ఆర్థికంగా నష్టపోకుండా, ఉద్యోగాల్లో కోత పడకుండా తోడ్పాటు కోసం ట్రావెల్‌ అండ్‌ టూరిజం స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది.

ఆ నిబంధనతో టూరిజం రంగానికి కష్టమే..
కరోనా కారణంగా ప్రయాణాలు రద్దు చేసుకున్న కస్టమర్లకు రీఫండ్‌ చేయకుండా ఫోర్స్‌ మెజూర్‌ నిబంధన వాడుకునేలా విమానయాన సంస్థలకు అనుమతినిచ్చిన పక్షంలో టూరిజం, ట్రావెల్‌ రంగ సంస్థలపై భారీ ప్రతికూల ప్రభావం పడుతుందని ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఐఏఎంఏఐ) ఆందోళన వ్యక్తం చేసింది. సంక్షోభం నుంచి ఎయిర్‌లైన్స్‌ బైటపడేందుకు ఇది ఉపయోగపడవచ్చు గానీ వ్యవస్థలోని మిగతా రంగాలను దెబ్బతీస్తుందని, లక్షల మంది ఉపాధికి గండి కొడుతుందని పేర్కొంది

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top