
జీఎస్‌టీతో లాభమా? నష్టమా?
ఏ వస్తువు ధరయినా తగ్గుతుందా? లేక పెరుగుతుందా? అనేది ఆయా వస్తువుపై విధించే జీఎస్‌టీ రేటు ఎంత అనే దానిపైనే ఆధారపడి ఉంటుందన్నది నిజం.
♦ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌తో వర్తకులకు లాభమే
♦ పన్ను మీద పన్ను... వ్యవస్థకు చెల్లుచీటీ
♦ మరింత సమర్థంగా వసూళ్లు; ఒకే రిటర్న్ కూడా
♦ ఏడాది మధ్యలో అమలుతో కాస్త గందరగోళం
♦ రూ.20 లక్షల టర్నోవర్ ఉన్నవారూ దీని పరిధిలోకి
♦ పన్నులపై అధికారమంతా జీఎస్‌టీ కౌన్సిల్ పరిధిలోకి
ఏ వస్తువు ధరయినా తగ్గుతుందా? లేక పెరుగుతుందా? అనేది ఆయా వస్తువుపై విధించే జీఎస్‌టీ రేటు ఎంత అనే దానిపైనే ఆధారపడి ఉంటుందన్నది నిజం. ప్రస్తుతానికి జీఎస్‌టీలో ఐదు శ్లాబుల్ని చేర్చారు. అందులో మొదటిది జీరో కాగా... ఆ తరవాత నుంచి 5, 12, 18, 28 శాతాలుగా మిగిలిన నాలుగు శ్లాబుల్నీ విభజించారు. ఉన్నాయి. ఏ వస్తువైనా, సేవలైనా ఈ పన్ను శ్లాబుల పరిధిలోకి రావాల్సిందే. దీన్నిబట్టే ధరల్లో ఎక్కువ తక్కువల్ని చెప్పే అవకాశం ఉంటుంది. అయితే శ్లాబుల్ని బట్టి కలిగే లాభనష్టాలను కాసేపు పక్కనబెట్టి... జీఎస్‌టీ వల్ల ప్రయోజనాలేంటో, ఇబ్బందులెవరికో ఒకసారి చూద్దాం...
ఇవీ ప్రయోజనాలు...!
ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ వర్తిస్తుంది
పరోక్ష పన్ను విధానంలో వర్తించని ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ).. జీఎస్‌టీలో వర్తిస్తుంది. అంటే... ఉదాహరణకు ఒక తయారీ సంస్థ ఒక వస్తువు తయారు చేయటానికి కావాల్సిన ముడి సరుకులను రూ.100 పెట్టి కొనుగోలు చేసిందనుకుందాం. దీనిపై 10 శాతం... అంటే రూ.10 రాష్ట్రానికి ఇన్‌పుట్ ట్యాక్స్ కడుతుంది. ఇప్పుడా వస్తువును తయారు చేసి... అదే రాష్ట్రంలో లాభం కలిపి రూ.200కు విక్రయించిందనుకుందాం. అప్పుడు అదే రాష్ట్రానికి ఈ సంస్థ అమ్మకం పన్ను (అవుట్ పుట్ ట్యాక్స్) కూడా చెల్లిస్తుంది. ఇక్కడ గమనించాల్సిందేంటంటే.. ఒక ఉత్పత్తి తయారీ, విక్రయం రెండూ ఒకే రాష్ట్ర పరిధిలో జరిగినప్పుడు ఇన్‌పుట్, ఔట్‌పుట్ ట్యాక్స్ రెండూ ఆ సంస్థ భరించాల్సి వస్తోంది. అయితే జీఎస్‌టీలో మాత్రం ఏ రాష్ట్రంలో తయారు చేసి.. ఏ రాష్ట్రంలో అమ్మినా సరే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది. అంటే... ముడి పదార్థాల కొనుగోలు సమయంలోనే ఇన్‌పుట్ ట్యాక్స్ కట్టేసింది కనక... అమ్మకం సమయంలో ఆ మొత్తాన్ని మినహాయిస్తారన్న మాట.
పన్నులపై పన్నులుండవు
జీఎస్‌టీ వచ్చాక పన్ను మీద పన్ను భారం ఉండదు. ఉదాహరణకు ఉత్పత్తిదారుడు ఒక ఉత్పత్తి తయారీకి అవసరమైన ముడిసరుకును రూ.100 పెట్టి కొనుగోలు చేశాడు. ఉత్పత్తి తయారీ మరో రూ.100 ఖర్చయింది అనుకుందాం. అంటే ఆ ఉత్పత్తి వ్యయం రూ.200. దీని మీద ఎక్సైజ్ డ్యూటీ (12 శాతం) రూ.24. అంటే మొత్తం రూ.224 అయింది. ఇప్పుడీ వస్తువును ఒక రాష్ట్రంలో విక్రయించాలంటే సేల్స్ ట్యాక్స్(10%) కట్టాలి. అంటే రూ.224 మీద 10% కట్టాలి. ఇక్కడ గమనించాల్సిందేంటంటే... వాస్తవంగా ఉత్పత్తికి అయిన ఖర్చు రూ.200 మాత్రమే. ఎక్సైజ్ సుంకం కలిపాక రూ.224 అవుతోంది. కానీ, అమ్మకం సమయంలో సేల్స్ ట్యాక్స్‌ను ఉత్పత్తి వ్యయం మీద అంటే రూ.200 మీద కాకుండా ఎక్సైజ్ సుంకంతో కలిపిన మొత్తంపై... అంటే రూ.224పై చెల్లించాల్సి వస్తుంది. ఇది తయారీదారులకు రెండు రకాల పన్నుల భారంగా మారుతోంది. జీఎస్‌టీ వస్తే ఈ పన్నుల మీద పన్నుల భారం ఉండదు.
ఇకపై ఒకే రిటర్న్ చాలు: ప్రస్తుతం మన దేశంలో ఒక్కో పన్ను చెల్లించటానికి ఒకో తరహా రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్సైజ్ డ్యూటీ, సెంట్రల్ డ్యూటీ, వ్యాట్, సీఎస్టీ ఇలా ఒక్కో దానికి ఒక్కో ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. కానీ, జీఎస్‌టీతో ఇవేవీ అవసరం ఉండదు. దేశమంతా ఒకే పన్ను విధానం లాగా.. ఒకే ట్యాక్స్ రిటర్న్‌ను ఫైల్ చేస్తే సరిపోతుంది.
సమర్థంగా పన్నుల వసూలు
జీఎస్‌టీని అమలు చేయటం ద్వారా పన్నులు వసూలు చేయటంలో సమర్థత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పన్నుల వసూళ్లలో అవినీతి తగ్గుతుందనేది కూడా నిపుణుల భావన. ప్రస్తుతమున్న పరోక్ష పన్ను విధానంలో రాష్ట్ర పరిధిలోని పన్నుల్ని లెక్కించేటపుడు... వస్తువు విలువ + కేంద్ర పన్ను రెండూ కలిపాక పన్ను విధిస్తారు. జీఎస్‌టీలో అయితే కేవలం వస్తువు విలువపైనే పన్నును లెక్కకడతారు. దీనివల్ల అంతిమంగా వస్తువు ధర తగ్గుతుంది.
ఎగుమతులకు ఊతం: జీఎస్‌టీ చట్టం ప్రకారం ఎగుమతి చేసే వస్తువులు, సేవలపై ఎలాంటి పన్నులూ ఉండవు. పైగా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) కూడా ఎగుమతిదారుడికి లభిస్తుంది. అంతేకాక జీఎస్‌టీ ఒకే విధానం కనక కంపెనీలకు లాజిస్టిక్ ఖర్చులు తగ్గుతాయి.
ఇబ్బందులు... నష్టాలు కొంత గందరగోళం..
దేశంలో జీఎస్‌టీని ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి కచ్చితంగా అమలు చేయాల్సిందేనని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు వేగంగా నిర్ణయాలు కూడా ప్రకటిస్తోంది. కానీ, ప్రస్తుతం మనం 2017–18 ఆర్ధిక సంవత్సరం మధ్యలో ఉన్నాం. అప్పటివరకు పాత పన్ను విధానాన్ని పాటిస్తూ... రాత్రికి రాత్రే జీఎస్‌టీలోకి మారడం కంపెనీలకు, వర్తకులకు కొంత గందరగోళాన్ని కలిగిస్తోంది.
చిన్న కంపెనీలూ ఈ పరిధిలోకే..
ప్రస్తుత పరోక్ష పన్ను విధానంలో రూ.1.50 కోట్ల టర్నోవర్ పైన ఉన్న కంపెనీలు మాత్రమే ఎక్సైజ్ డ్యూటీని చెల్లించాలనే నిబంధన ఉంది. అయితే అన్ని కంపెనీలనూ జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ టర్నోవర్ మొత్తాన్ని రూ.20 లక్షలకు కుదించారు. ఇది చిన్న, మధ్యతరహా (ఎస్‌ఎంఈ) కంపెనీలకు ఇబ్బందికరం, నష్టం కూడా.
ఆన్‌లైన్... కొందరికి కష్టం
జీఎస్‌టీతో నిర్వహణ వ్యయం పెరుగుతుంది. ఎలాగంటే దీన్ని పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాల్సి ఉండంటతో చిన్న, మధ్య తరహా వ్యాపారులు, కంపెనీలు ఐటీ నిపుణులను నియమించుకొని జీఎస్‌టీని నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు ప్రస్తుత అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్/ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్(ఈఆర్పీ)లను మార్చి.. జీఎస్‌టీ టెక్నాలజీ ఉండే అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఇక ఏ రాష్ట్రమైనా ఒకటేనా?
ప్రస్తుతం తయారీ రంగాలకు చెందిన పలు సంస్థలు పన్ను రాయితీలున్న, పన్నుల పరంగా అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అక్కడి నుంచే ఇతర రాష్ట్రాలకు పంపించటం చేస్తున్నాయి. ఈ–కామర్స్ సంస్థలైతే పన్నుల్లో వెసులు బాటు కోసం దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ గిడ్డంగుల్ని ఏర్పాటు చేస్తున్నాయి. జీఎస్‌టీతో దేశమంతటా ఒకే రకమైన పన్ను విధానం ఉన్నప్పుడు ఇవి అన్ని రాష్ట్రాల్లో గిడ్డంగులను నిర్వహించాల్సిన అవసరం ఉండదు. డిస్ట్రిబ్యూషన్ వ్యయం పెరుగుతుంది. సరకుల రవాణా సమయం కూడా పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఔట్ ఆఫ్ స్టాక్ పరిస్థితి ఏర్పడొచ్చు కూడా. గిడ్డంగులపై ఆధారపడిన వారికి ఉపాధి అవకాశాలు దూరమై భూముల ధరలూ పడిపోయే ప్రమాదమూ ఉంది.
వ్యాట్ కంటే జీఎస్టీ రేటు ఎక్కువగా ఉంటే...
తాజాగా శ్లాబులు ప్రకటించటంతో ఏ వస్తువుపై జీఎస్‌టీ ఎంత అనేది స్పష్టమైపోయింది. కాకపోతే ఏ వస్తువు విషయంలోనైనా ప్రస్తుత వ్యాట్ రేటు కన్నా జీఎస్‌టీ రేటు అధికంగా ఉంటే వ్యాపారులకు ఇబ్బందే. ఎందుకంటే ఇప్పటికే రిటైలర్ స్టోర్లలో బోలెడు స్టాక్ ఉంది. ఆయా ఉత్పత్తులపై ఎంఆర్‌పీ ధర ఉంటుంది. జీఎస్‌టీ రేటు పెరగడంతో కంపెనీలకు లాభాలు తగ్గిపోతాయి.
మూలధనానికి ఇక్కట్లే..: ఉత్పాదక రంగంపై మూలధన ప్రభావం గణనీయంగా ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం స్టాక్ బదిలీపై ఎలాంటి పన్నులూ లేవు. కానీ, జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక సరఫరా జీఎస్టీ పరిధిలోనే చేయాల్సి ఉంటుంది గనక.. కంపెనీలు సరఫరా చైన్ నిర్వహణ వ్యూహాలపై పునరాలోచనలో పడతాయి. ఇది కంపెనీల నగదు ప్రవాహంపై ప్రభావాన్ని చూపిస్తుంది.
రాష్ట్రాల నియంత్రణకు చెక్!
జీఎస్‌టీ అమలుతో రాష్ట్రాలు పన్నులపై నియంత్రణ కోల్పోతాయి. ఎలాగంటే దేశంలో నిర్వహించే ప్రతి ఒక్క వ్యాపారం మీద కేంద్రం, రాష్ట్రం రెండు ప్రభుత్వాల రూపంలో ద్వంద్వ నియంత్రణ ఉంటుంది. రాష్ట్ర పరిధిలో పన్ను రేట్లను మార్చుకునే లేదా తగ్గించుకునే అవకాశం, అధికారం రెండూ కూడా స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు. అది పూర్తిగా జీఎస్‌టీ కౌన్సిల్ పరిధిలో ఉంటుంది.
ఏ వస్తువుపై ఎంత జీఎస్‌టీ? వస్తువులు, సేవల సమగ్ర జాబితా
(పూర్తి వివరాల కోసం www.sakshibusiness.com చూడండి)
– సాక్షి, బిజినెస్ విభాగం