పిరమల్‌ ఫార్మాలో 20% వాటా విక్రయం

Carlyle group buys 20% stake in Piramal pharma - Sakshi

కార్లయిల్‌ గ్రూప్‌ కొనుగోలు

డీల్‌ విలువ రూ. 3700 కోట్లు

ఐవోబీ క్యూ4 ఫలితాలు భళా

52 వారాల గరిష్టానికి షేరు

హెల్త్‌కేర్‌ విభాగం పిరమల్‌ ఫార్మాలో యూఎస్‌ సంస్థ కార్లయిల్‌ గ్రూప్‌ 20 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తాజాగా పేర్కొంది. డీల్‌ అంచనా విలువను 49 కోట్ల డాలర్లు(సుమారు రూ. 3700 కోట్లు)గా వెల్లడించింది. ఇందుకు కార్లయిల్‌ గ్రూప్‌నకు చెందిన సీఏ క్లోవర్‌ ఇంటర్మిడయట్‌ 2 ఇన్వెస్ట్‌మెంట్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తెలియజేసింది. నికర రుణం, మారకపు రేటు, పనితీరు వంటి అంశాల ఆధారంగా డీల్‌కు తుది ధరను నిర్ణయించనున్నట్ల అజయ్‌ పిరమల్‌ గ్రూప్‌ కంపెనీ వివరించింది. కాగా.. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు నామమాత్ర లాభంతో రూ. 1344 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 1370 వద్ద గరిష్టాన్ని తాకగా.. 1317 దిగువన కనిష్టాన్నీ చవిచూసింది. 

ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో పీఎస్‌యూ సంస్థ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌(ఐవోబీ) కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. దీంతో వారాంతాన ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ షేరు 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. అంతా కొనుగోలుదారులేతప్ప అమ్మేవాళ్లు కరువుకావడంతో రూ. 13.10 వద్ద ఫ్రీజయ్యింది. తద్వారా 52 వారాల గరిష్టానికి చేరింది. 18 త్రైమాసికాల తదుపరి టర్న్‌అరౌండ్‌ ఫలితాలను సాధించిన నేపథ్యంలో గురువారం సైతం ఈ కౌంటర్‌ 10 శాతం దూసుకెళ్లింది. 

టర్న్‌అరౌండ్‌
గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ఐవోబీ రూ. 144 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 1985 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొండి రుణాలకు కేటాయింపులు తగ్గడంతో లాభదాయకత మెరుగైనట్లు నిపుణులు తెలియజేశారు. నికర వడ్డీ ఆదాయం 3.6 శాతం పెరిగి రూ. 1532 కోట్లను తాకగా.. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు రూ. 4502 కోట్ల నుంచి రూ. 1479 కోట్లకు భారీగా తగ్గాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 21.97 శాతం నుంచి 14.78 శాతానికి దిగిరాగా.. నికర ఎన్‌పీఏలు సైతం 10.81 శాతం నుంచి సగానికి క్షీణించి 5.44 శాతానికి చేరాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top