
ఇదీ... కోర్కెల చిట్టా
పారిశ్రామికవేత్తలు, నిపుణులు, విశ్లేషకులు సహా ఆర్థిక రంగమంతా ఫిబ్రవరి 28వ తేదీ కోసం ఎదురుచూస్తోంది...
పారిశ్రామికవేత్తలు, నిపుణులు, విశ్లేషకులు సహా ఆర్థిక రంగమంతా ఫిబ్రవరి 28వ తేదీ కోసం ఎదురుచూస్తోంది. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టే 2015-16 ఆర్థిక సంవత్సరం బడ్జెట్టే ఆ రోజు స్పెషల్. బడ్జెట్‌పై ఏ రంగం కోరికలు ఆ రంగానివి. ఎవరి విశ్లేషణ వారిది. వీటిలో ప్రముఖులు చెబుతున్న కొన్ని ముఖ్య అంశాలివీ...
80సీ పరిమితి పెంచాలి
సెక్షన్ 80సీ కింద లభించే పన్ను మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి మరింత పెంచాలి. చాలా కాలం ఈ పరిమితి రూ. లక్ష వద్దే ఉంది. దీనివల్ల పెద్దగా పొదుపు లక్ష్యాలు నెరవేరలేదు, గత బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని మరో రూ.50 వేలు పెంచినా... ఆర్థిక సాధనాల ద్వారా వ్యక్తిగత ప్రయోజనం పొందడానికి ఈ మొత్తాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. పీపీఎఫ్, ఈపీఎఫ్, న్యూ పెన్షన్ స్కీమ్, బీమా పాలసీలు, ఈక్విటీ అనుసంధాన పొదుపు పథ కాల్లో పెట్టుబడిపై రూ.1.50 లక్షల వరకూసెక్షన్ 80సీ కింద ఐటీ మినహాయింపు ఉంది. ఆర్థిక పొదుపులకు కూడా ఇది దోహదపడుతుంది కనక దీన్ని పెంచాల్సిన అవసరం చాలా ఉంది. 2008లో 36.9 శాతంగా ఉన్న భారత జాతీయ పొదుపు రేటు ఇపు 30 శాతానికి పడిపోవటాన్ని గుర్తించాలి.
- రఘురామ్ రాజన్, ఆర్‌బీఐ గవర్నర్
జీడీపీలో 6 శాతం విద్యపై వెచ్చించాలి
విద్యపై వ్యయాలను గణనీయంగా పెంచాలి. మహిళలపై జరుగుతున్న నేరాలను సమర్థంగానిరోధించడానికి నిర్భయ ఫండ్ పరిధిని విస్తరించాలి. స్థూల దేశీయోత్పత్తిలో కనీసం 6 శాతాన్ని విద్యపై ఖర్చుచేయాలి. దళితులు, ఆదీవాసీల ప్రయోజనాలకు ఉద్దేశించిన నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలి. నీతి ఆయోగ్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌లకు ప్రత్యేక విభాగాన్ని కేటాయించాలి. మధ్యాహ్నం భోజన పథకానికి తగిన నిధులు కేటాయించాలి.
- ప్రదీప్ మెహతా, వినియోగదార్ల సొసైటీ
ఎక్సయిజు రాయితీలుండాలి
అధిక వడ్డీరేట్లు, బలహీన ఆర్థిక పరిస్థితుల వల్ల వాహనాల డిమాండ్ తక్కువగానే ఉంది. ఎక్సయిజ్ సుంకం రాయితీలను డిసెంబర్ తరువాత ఉపసంహరించడం వాహన పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. బడ్జెట్లో ప్రభుత్వం భారీ నజరానాలు ప్రకటించకపోతే, వాహన పరిశ్రమ స్వల్పకాలంలో కోలుకునే సూచనలేమీ లేవు. మేక్ ఇన్ ఇండియాలో వాహన రంగం కీలకమైనది కనక ఈ రంగానికి సంబంధించి సంస్కరణలు బడ్జెట్‌లో ఉండాలి. వాహన విడిభాగాలపై ఎక్సయిజు సుంకాన్ని 12 నుంచి 10 శాతానికి తగ్గించాలి. విద్యుత్ కొరత వల్ల ఉత్పత్తి దారులు డీజిల్ జనరేటర్లు ఉపయోగించి కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఫలితంగా ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. దీనిని నివారించడానికి డీజిల్‌పై ఇన్‌పుట్ క్రెడిట్‌ను ఇవ్వాలి.
- వాహన రంగం
స్టార్టప్, ఎస్‌ఎంఈలకు నిధులివ్వాలి...
టెక్నాలజీ స్టార్టప్‌లు, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎస్‌ఎంఈ) ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. నియంత్రణ, పన్నుల పరంగా ఇబ్బందులను తొలగించాలి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, పరిశ్రమ పరస్పరం సహకరించుకోవాలి. స్టార్టప్స్, ఎస్‌ఎంఈలకు నిధులు అందుబాటులో ఉండటం, కార్యకలాపాల నిర్వహణకు ప్రోత్సాహం అవసరం. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలతో టెక్నాలజీ రంగంలో అపార అవకాశాలు లభిస్తాయి. సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల ట్యాక్సేషన్ విధానంలో అస్పష్టత తొలగించాలి. నిబంధనలు, పన్నులపరంగా ఇన్వెస్టర్లు ఎదుర్కొనే సమస్యల్ని పరిష్కరించాలి. సేవా పన్ను చెల్లింపు విషయంలో వివాదాలుంటే ఆయా మొత్తాలపై విధించే పెనాల్టీ రేటును హేతుబద్ధీకరించాలి. ఈ-కామర్స్‌ను ప్రోత్సహించేలా డిజిటల్ లావాదేవీలపై తక్కువ పన్నులు వేయాలి. ఐటీని ఉపయోగించుకునే సంస్థలకు ప్రోత్సాహకాలివ్వాలి.
- నాస్కామ్..
పన్ను పరిమితి రూ.5 లక్షలు చేయండి...
ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలు చేయాలి. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) డిజిన్వెస్ట్‌మెంట్‌ను తక్షణమే నిలిపివేయాలి. ఖాయిలా పడినప్పటికీ మళ్లీ మెరుగుపడే అవకాశాలున్న కేంద్ర ప్రభుత్వ సంస్థల పునరుద్ధరణకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలి. ద్రవ్యోల్బణ కట్టడికి తగిన చర్యలతో పాటు కమోడిటీల్లో ఫార్వర్డ్ ట్రేడింగ్‌ను నిషేధించాలి. పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు.. సుంకాలను క్రమబద్ధీకరించాలి. రక్షణ వంటి కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించడానికి వ్యతిరేకం.
- సాధారణ ఉద్యోగి
పన్ను శ్లాబులు మార్చండి...
ఐటీ రిఫండ్‌లను వేగంగా ఇవ్వాలి. రూ. 3 లక్షల నుంచి రూ.6 లక్షల ఆదాయంపై 10 శాతం, రూ.6-12 లక్షల రేంజ్ ఆదాయంపై 20 శాతం, రూ.12 లక్షలకు మించిన ఆదాయంపై 30 శాతం చొప్పున ఆదాయపు పన్ను విధించాలి. ప్రస్తుతం 32.45 శాతం(సర్‌చార్జీలు, ఇతర సెస్సులు కలుపుకొని)గా ఉన్న కార్పొరేట్ ట్యాక్స్‌ను 25 శాతానికి, 18.5 శాతంగా ఉన్న కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్)ను 10 శాతానికి తగ్గించాలి. గృహ రుణాలకు సంబంధించిన వడ్డీ మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలి. ఇక అసలు చెల్లింపులకు సంబంధించిన పరిమితిని ప్రస్తుతమున్న రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షలకు పెంచాలి. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలి. రెట్రోస్పెక్టివ్ సవరణను తొలగించాలి. ఫలితంగా వాణిజ్య, వ్యాపార పరిస్థితులు మెరుగవుతాయి. భారత్‌పై అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లకు విశ్వాసం పెరుగుతుంది.
- అసోచామ్